మధుర వివాదంలో మసీదు పిటిషన్ కొట్టేసిన సుప్రీం

మధుర వివాదంలో మసీదు పిటిషన్ కొట్టేసిన సుప్రీం

మధుర శ్రీకృష్ణ జన్మభూమి-షాహి ఈద్గా మసీదు వివాదంలో అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు శుక్రవారం సమర్థించింది. హైకోర్టు ఉత్తరువులను సవాలు చేస్తూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను తర్వాత లేవనెత్తవచ్చని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది. 

ఈ వివాదానికి సంబంధించి హిందూ ఫిర్యాదుదారు దాఖలు చేసిన 15 పిటిషన్‌లను న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఏకీకృతం చేయాలని అలహాబాద్‌ హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ మసీదు కమటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ సంజయ్ కుమార్‌లతో కూడిన థర్మాసనం హైకోర్టు తీర్పుని సమర్థించింది.   

ఇది వ్యాజ్యంలోని ఇరుపక్షాలకు అనుకూలంగా ఉందని పేర్కొంది. విచారణను వాయిదా వేస్తున్నామని, ఏప్రిల్‌ 1 నుండి ప్రారంభమయ్యే వారంలో రిలిస్ట్‌ (పిటిషన్‌) చేస్తామని పేర్కొంది. శుక్రవారం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రార్థనా స్థలాలపై 1991 నాటి చట్టానికి సంబంధించిన సమస్యగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. 

ఈ సమయంలో పిటిషన్‌ల ఏకీకరణపై ఎందుకు జోక్యం చేసుకోవాలని ప్రశ్నించింది. అవసరమైతే, మీరు తర్వాత అభ్యర్థనను లేవనెత్తవచ్చు అని మసీదు కమిటీ తరపు న్యాయవాదితో సిజెఐ చెప్పారు. 

మతపరమైన ప్రదేశాలు ముఖ్యంగా మసీదులు, దర్గాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు దేశంలోని న్యాయస్థానాలు తాజా వ్యాజ్యాలు, పెండింగ్‌లో ఉన్న వాటిపై సమర్థవంతమైన మధ్యంతర లేదా తుది ఉత్తర్వులను జారీ చేయకుండా తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు నిషేధం విధిస్తున్నట్లు డిసెంబర్‌ 12న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వేర్వేరు వ్యాజ్యాలు కలిపి విచారణ చేపట్టడం వలన పరిస్థితి సంక్లిష్టతకు దారితీస్తుందని మసీదు కమిటీ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.