ఢిల్లీ బాంబు బెదిరింపుల వెనుక 12వ తరగతి విద్యార్థి!

ఢిల్లీ బాంబు బెదిరింపుల వెనుక 12వ తరగతి విద్యార్థి!

దేశ రాజధాని ఢిల్లీలోని పలు పాఠశాలలకు 2024 డిసెంబర్ నెలలో పెద్ద ఎత్తున బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ ప్రజలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులే కాకుండా అనేక మంది దీని వల్ల తీవ్రంగా భయపడ్డారు. పిల్లలను బడికి పంపేందుకే జంకారు. అయితే ఒక్క నెలలోనే మూడు, నాలుగు సార్లు ఈ బాంబు మెయిల్స్ రాగా,  తాజాగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. 
 
డిసెంబర్ 24వ తేదీ రోజు ఢిల్లీలోని మూడు పాఠశాలలకు బాంబు బెదిరింపులు పంపింది తానేనంటూ ఓ 12 ఏళ్ల విద్యార్థి ఒప్పుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నిత్యం పాఠశాలలకు బాంబు బెదిరింపులు రాగా, పోలీసులు నిందితులను పట్టుకోవడం లేదనే కోపంతో తానే 3 బడులకు మెయిల్స్ పంపినట్లు విద్యార్థి ఒప్పుకున్నాడు. 
 
ఆ తర్వాత పోలీసులు సదరు బాలుడికి, ఆయన తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఇది జరగిన కొంత కాలానికే అసలు నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.  డిల్లీలో చివరగా గత బుధ, గురువారాలలో 23 పాఠశాలలకు వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్స్‌ను పంపింది 12వ తరగతి విద్యార్థిని అని పోలీసులు వెల్లడించారు. ఈ నేరాన్ని సదరు బాలుడు కూడా ఒప్పుకున్నట్లు స్పష్టం చేశారు.
 
“ఢిల్లీలోని వివిధ పాఠశాలలకు వచ్చిన తాజాగా 23 బెదిరింపు ఈమెయిల్స్‌ను 12వ తరగతి విద్యార్థి పంపాడు. విచారణలో, తాను గతంలో కూడా బెదిరింపు ఈమెయిల్స్ పంపినట్లు అతను అంగీకరించాడు” అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) సౌత్ అంకిత్ చౌహాన్ మీడియాకు తెలిపారు.
 
అయితే అతడు ఇలా చేయడానికి కారణం బడిలో పరీక్షలు ఉండడమే అని, వాటిని ఆపేందుకే ఆ విద్యార్థి ఇలా చేసినట్లు చెప్పారు. పాఠశాలలో పరీక్షలు నిర్వహించకూడదంటే ఏం చేయాలా అని బాలుడితో పాటు అతడి సోదరుడు ఆలోచించగా, గతంలో బాంబు బెదిరింపులు వస్తే బడులు మూసేసిన విషయం గుర్తుకు తెచ్చుకుని అలాగే చేయాలని నిర్ణయించుకున్నారట.
 
ఇద్దరు తోబట్టువులు కలిసే ఈ నిర్ణయం తీసుకోగా,12వ తరగతి విద్యార్థియే స్వయంగా 23 పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ పంపినట్లు పోలీసులు వివరించారు. అయితే ఎవరికీ అనుమానం రాకూడదనే ఉద్దేశంతోనే వారి బడికి మాత్రమే కాకుండా మిగతా పాఠశాలలకు కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ పంపాడట. గతంలోనూ ఆరు సార్లు బాలుడు ఇలాగే చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 
 
ఇదంతా ఇలా ఉండగా, 2024 డిసెంబర్ 9వ తేదీన మొత్తం 44 బడులకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఆ తర్వాత నాలుగు రోజులకే అంటే డిసెంబర్ 13 తేదీన 30 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రాగా, డిసెంబర్ 14వ తేదీన ఢిల్లీలోని పలు సంస్థలే లక్ష్యంగా ఈ మెయిల్స్ వచ్చాయి. ఇలా గతేడాది మే నుంచి డిసెంబర్ వరకు మొత్తంగా 100 వరకు బాంబు బెదిరింపులు రాగా, పోలీసులు నిందితులను పట్టుకునేందుకు తీవ్ర కృషి చేస్తున్నారు.