కోటా ప్రయోజనాలను పొంది, ఇతరులతో పోటీపడే స్థితికి వచ్చిన వ్యక్తులను రిజర్వేషన్ నుంచి మినహాయించాలా లేదా అన్న అంశంపై శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతేడాది ఆగస్టులో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఆధారంగా వేసిన పిటిషన్‌పై జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జి మసీహ్‌ల ధర్మాసనం గురువారం ఈ మేరకు పేర్కొంది.
“గత 75 ఏళ్లను పరిగణనలోకి తీసుకొని మా అభిప్రాయాన్ని తెలియపరిచాం. ఇప్పటికే రిజర్వేషన్ ప్రయోజనాలను అందుకొని, ఇతరులతో పోటీపడే స్థితికి వస్తే, అలాంటి వ్యక్తులను రిజర్వేషన్ నుంచి మినహాయించాలి. కానీ ఈ నిర్ణయాన్ని కార్యనిర్వాహక, శాసన వ్యవస్థ తీసుకోవాల్సి ఉంటుంది” అని జస్టిస్ గవాయ్ తెలిపారు.
షెడ్యూల్డ్ కులాలను (ఎస్సీ) ఉప వర్గాలుగా వర్గీకరించే అధికారం రాష్ట్రాలకు ఉందని రాజ్యాంగ ధర్మాసనం గతేడాది మెజారిటీ తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఆ ధర్మాసనంలో సభ్యుడైన జస్టిస్ గవాయ్ విడిగా రాసిన తీర్పులో ఎస్సీ, ఎస్టీల్లో సంపన్నశ్రేణిని (క్రీమీలేయర్) గుర్తించాల్సిన విధానాన్ని రాష్ట్రాలు రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది ఈ తీర్పును ఉటంకిస్తూ, క్రీమీలేయర్‌ను గుర్తించే విధానాన్ని ఏర్పరచుకోవాలని రాజ్యాంగ ధర్మాసనం చెప్పి ఆరు నెలలైనా ఇంకా రాష్ట్రాలు ఇంకా రూపొందించలేదని తెలిపారు. ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని కోరారు. ఇందుకు ధర్మాసనం ‘చట్ట సభ్యులే చట్టాలు రూపొందించాలి’ అని తెలిపింది.
‘గత 75 ఏండ్లను పరిగణనలోకి తీసుకొని, ఇప్పటికే కోటా ప్రయోజనాలు పొంది, ఇతరులతో పోటీ పడగల వారిని రిజర్వేషన్ల నుంచి మినహాయించాలని మేము ఇప్పటికే మా అభిప్రాయాన్ని స్పష్టం చేశాం. కానీ, ఈ నిర్ణయం తీసుకోవాల్సింది కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలే’ అని జస్టిస్ గవాయి వ్యాఖ్యానించారు. రాష్ర్టాలు విధానాన్ని రూపొందించవని, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా.. ‘శాసనసభ్యులు ఉన్నారు, వారు చట్టం చేయగలరు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
దీంతో ఈ అంశాన్ని సంబంధిత అధికార వర్గాల ముందే ప్రస్తావిస్తామని పేర్కొని పిటిషనర్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాల్సిందిగా న్యాయవాది కోరగా కోర్టు అంగీకరించింది.
More Stories
జమిలీ ఎన్నికలపై 31న జేపీసీ రెండో సమావేశం
బిజెపి ఎంపీలపై క్రిమినల్ కేసు కొట్టివేత
8 రోజుల్లో 9 కోట్ల మంది పుణ్యస్నానాలు