రిజర్వ్ చేసిన తీర్పులు 3 నెలల్లోపు ఇవ్వాల్సిందే 

రిజర్వ్ చేసిన తీర్పులు 3 నెలల్లోపు ఇవ్వాల్సిందే 
కేసుల విచారణ అనంతరం తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత మూడు నెలల్లోగా తుది తీర్పు వెల్లడించాలని హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచించింది. తీర్పు ఆలస్యం కావడం వల్ల పిటిషన్‌దారులకు తీవ్ర నష్టం జరుగుతుందని కోర్టు అభిప్రాయపడింది. ఈ అంశంపై శుక్రవారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని హైకోర్టులు విచారణ అనంతరం తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత మూడు నెలల్లోగా తీర్పు వెల్లడించాలని ఆదేశించింది.
 
వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో నిర్ణయాలు మరింత వేగంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఉద్ఘాటించింది. బెయిల్ దరఖాస్తులకు సంబంధించి కూడా అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. బెయిల్ దరఖాస్తులపై విచారణ పూర్తైన రోజే ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. 
 
ఒకవేళ తీర్పును రిజర్వ్ చేస్తే, మరుసటి రోజు కచ్చితంగా తీర్పును వెలువరించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని నిర్దేశించింది. ఖైదీల విడుదలకు సంబంధించి పలు నిబంధనలు విధించింది. బెయిల్ లేదా శిక్ష నిలుపుదలకు సంబంధించిన ఉత్తర్వులను వెంటనే సంబంధిత జైలు అధికారులకు పంపాలని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. 
 
ఆ ఉత్తర్వులు అందిన వెంటనే, విచారణలో ఉన్న నిందితులను లేదా దోషులను సాధ్యమైనంత వరకు అదే రోజు లేదా మరుసటి రోజు జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. బెయిల్ ఉత్తర్వుల అమలుపై ట్రయల్ కోర్టు హైకోర్టుకు నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. కాగా, తాము జారీ చేసిన ఆదేశాల ఉద్దేశం ఏ ప్రత్యేక న్యాయమూర్తిపైనా, హైకోర్టు తీర్పుపైనా నిందలు వేసేందుకు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
“ఝార్ఖండ్ హైకోర్టు తీర్పును 10 మంది దోషులపై కేసులను క్రిమినల్ అప్పీళ్ల కోసం రిజర్వ్ చేయడంతో ఈ విచారణ ప్రారంభమైంది. ఇలా మూడేళ్ల వరకు దీనిపై తీర్పులు వెలువడలేదు. దీంతో తీర్పు వెలువరించాలంటూ సుప్రీంకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయగా, వెంటనే వారం రోజుల్లోనే ఝార్ఖండ్ హైకోర్టు 75 తీర్పులను వెలువరించింది. ఈ క్రమంలోనే దీనిని పెద్ద సమస్యగా భావించిన సుప్రీంకోర్టు, తీర్పుల జారీలో న్యాయ జాప్యాన్ని పరిష్కరించడానికి అన్ని హైకోర్టుల పనితీరును క్లుప్తంగా సమీక్షించింది” అని  అమికస్ క్యూరీ మాలిక అగర్వాల్ తెలిపారు.