రూ.1,033 కోట్లతో శబరిమల అభివృద్ధి

రూ.1,033 కోట్లతో శబరిమల అభివృద్ధి
కేరళలోని ప్రసిద్ధ శబరిమలను రూ.1,033.62 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. దీనికి సంబంధించిన మాస్టర్‌ ప్లాన్‌ను ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.  సన్నిధానం, పంపా, ట్రక్ రూట్ వంటి కీలక ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి బ్లూప్రింట్‌ రూపొందించారు. మొత్తం రూ.778.17 కోట్ల వ్యయంతో సన్నిధానం ప్రాంతాన్ని మూడు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. 
 
మొదటి దశ పనులకు రూ. 600.47 కోట్లు, 2028-2033 మధ్య చేపట్టనున్న రెండో దశ పనులకు రూ. 100.02 కోట్లు, 2034-39 మధ్య చేపట్టనున్న మూడో దశ పనులకు రూ.77.68 కోట్లు కేటాయించనున్నారు. కాగా, అయ్యప్ప స్వామి సన్నిధానం ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతకు భంగం కలుగకుండా లేఅవుట్ ప్లాన్ రూపొందించినట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. 
 
ఈ ప్రాంతాన్ని ఎనిమిది జోన్‌లుగా విభజించినట్లు పేర్కొంది. మకరవిళక్కు (మరక జ్యోతి) దృశ్యాలు కనిపించేలా, భక్తుల రద్దీని నియంత్రించేలా రెండు ఓపెన్ ప్లాజాలు నిర్మించనున్నట్లు వెల్లడించింది. మరోవైపు అటవీ మార్గంలో ప్రయాణించే  యాత్రికుల సురక్షితం, సౌకర్యం కోసం వాహన రూట్‌ లేఅవుట్‌ ప్లాన్‌ను రూపొందించారు. 
 
ఈ మార్గంలో షెల్టర్లు, విశ్రాంతి భవనాలు నిర్మిస్తారు. రోడ్డుకు రెండు వైపులా అత్యవసర వాహన లేన్, పర్యావరణ పునరుద్ధరణ కోసం బఫర్ జోన్‌లతో ప్రణాళికలు సిద్ధం చేశారు. రూ. 47.97 కోట్ల వ్యయంతో ట్రక్‌ రూట్‌ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. తొలి దశ పనులకు రూ.32.88 కోట్లు, రెండో దశ పనులకు రూ.15.50 కోట్లు కేటాయించనున్నారు.కాగా, పంపా అభివృద్ధికి రూ.207.48 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. మొదటి దశకు రూ. 184.75 కోట్లు, 2028-33 మధ్య రెండో దశ పనులకు రూ.22.73 కోట్లు కేటాయిస్తారు. శబరిమల మాస్టార్‌ ప్లాన్‌ ప్రకారం పంపా, ట్రక్ రూట్ అభివృద్ధికి కలిపి మొత్తం రూ. 255.45 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.