ప్ర‌వాసీ భార‌తీయ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ

ప్ర‌వాసీ భార‌తీయ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ
 
* 18వ ప్రవాసీ భారతీయ దివస్ ప్రారంభం
 
విదేశీ భార‌తీయుల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వాసీ భార‌తీయ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించింది. భువ‌నేశ్వ‌ర్‌లో జ‌రుగుతున్న 18వ ప్ర‌వాసీ భార‌తీయ దివ‌స్ సంద‌ర్భంగా ఈ రైలును వ‌ర్చువ‌ల్‌గా ప్ర‌ధాని మోదీ ప్రారంభించారు. ఎన్ఆర్ఐ టూరిస్టుల కోసం ఈ రైలును ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేష‌న్ నుంచి ఈ రైలు బ‌య‌లుదేరింది.  జనవరి 9, 1915న మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన జ్ఞాపకార్థం జనవరి 9న దీనిని ప్రారంభించారు.
 
మూడు వారాల ప్రయాణం ఉంటుంది. దేశంలోని ప‌లు సంప్ర‌దాయ‌, మ‌త‌ప‌ర‌మైన ప్ర‌దేశాల‌ను ఆ రైలు చుట్టివ‌స్తుంది.  ప్ర‌వాసీ భార‌తీయ ఎక్స్‌ప్రెస్‌ను ప్ర‌త్యేక టూరిస్టు రైలును రూపొందించారు. విదేశాల్లో ఉన్న భార‌తీయుల కోసం ఈ టూరిస్టు రైలు కాన్సెప్ట్‌ను డెవ‌ల‌ప్ చేశారు. 45 ఏండ్ల నుంచి 65 ఏండ్ల మ‌ధ్య ఉన్న‌వారు ఈ రైలులో ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. త‌మ చారిత్రాత్మ‌క మూలాల‌ను ట‌చ్ చేసే రీతిలో ఈ రైలు మార్గంను ఏర్పాటుచేశారు. ఢిల్లీ నుంచి బ‌య‌లుదేరిన రైలు ఆ త‌ర్వాత అయోధ్య చేరుకుంటుంది. అక్క‌డ నుంచి పాట్నా, గ‌యా, వారణాసి, మ‌హాబ‌లిపురం, రామేశ్వ‌రం, మ‌ధురై, కొచ్చి, గోవా, ఎక్తా న‌గ‌ర్‌(కేవ‌డియా), అజ్మీర్‌, పుష్క‌ర్‌, ఆగ్రా ప‌ట్ట‌ణాల‌ను ఆ రైలు చుట్టువ‌స్తుంది. ఈ రైలులో 156 మంది ప్ర‌యాణికుల ప్రయాణించే అవ‌కాశం ఉంటుంది. 

విదేశాంగ శాఖ‌, భార‌తీయ రైల్వే, ఐఆర్సీటీసీ క‌లిసి ప్ర‌వాసీ రైలును ప్రారంభించారు. వివిధ దేశాల్లోని భార‌తీయ ఎంబ‌సీల నుంచి ఈ రైలు ప్ర‌యాణికుల కోసం ద‌ర‌ఖాస్తు చేశారు. త‌క్కువ ఆదాయం ఉన్న వారికి ఈ రైలులో ప్ర‌యాణించే అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. విదేశాంగ శాఖ ప్ర‌కార రైలు ప్రయాణంకు చెందిన అన్ని ఖ‌ర్చుల‌ను కేంద్ర ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంది. 

ఆయా దేశాల నుంచి భారత్ కు వ‌చ్చే ప్ర‌వాసీల తిరుగు ప్రయాణం విమాన ఖ‌ర్చులో 90 శాతం కూడా ప్ర‌భుత్వ‌మే పెట్టుకోనున్న‌ది. ప్ర‌యాణికులు కేవ‌లం 10 శాతం ఛార్జీ మాత్ర‌మే చెల్లించాల్సి ఉంటుంది. ఈ రైలులో పర్యటించే వారికి 4స్టార్ హోట‌ల్ వసతి కల్పించనున్నారు. రైలు ఆవిష్క‌ర‌ణ గురించి మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ ఓ ట్వీట్ చేశారు.

కాగా, 18వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ రం అధికారికంగా భువ‌నేశ్వ‌ర్‌ లో ప్రారంభించారు. ఆ తర్వాత ప్రధాని మోదీ సహా అతిథులు ఉండగా తొలి స్వాగత గీతం ‘బసుధైవ కుటుంబం’ను ప్రదర్శించారు. అనంతరం విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఎస్‌.జైశంకర్‌ స్వాగతోపన్యాసం చేశారు.

ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ కూడా ప్రసంగించారు. రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షురాలు క్రిస్టీన్ కార్లా కంగాలూ ప్రవాస సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

“మిత్రులారా, మేము మీ సౌలభ్యం, సౌకర్యానికి చాలా ప్రాముఖ్యతనిస్తాము. మీ భద్రత, శ్రేయస్సు మా మొదటి ప్రాధాన్యత. మన విదేశీ భారతీయులు ఎక్కడ ఉన్నా, సంక్షోభ సమయాల్లో వారికి సహాయం చేయడం మా బాధ్యతగా భావిస్తున్నాము. నేటి భారత విదేశాంగ విధానానికి మార్గదర్శక సూత్రాలలో ఇదీ కూడా ఒకటి” అని ప్రధాని మోదీ తెలిపారు.

రాబోయే అనేక దశాబ్దాల వరకు, భారతదేశం ప్రపంచంలోనే అత్యంత యువ, అత్యంత నైపుణ్యం కలిగిన జనాభా కలిగిన దేశంగా ఉంటుందని చెబుతూ నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల కోసం ప్రపంచ డిమాండ్‌ను భారత్ తీరుస్తుందని భరోసా వ్యక్తం చేశారు. నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల కోసం ప్రపంచ డిమాండ్‌ను తీర్చగల సామర్థ్యం భారతదేశానికి ఉందనే విషయాన్ని కూడా ప్రధాని చెప్పారు. 

ఈసారి ప్రవాసీ భారతీయ దివస్ సదస్సును ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో జనవరి 8 నుంచి 10 వరకు భువనేశ్వర్‌లో నిర్వహిస్తున్నారు.

”మీ అందరినీ కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరి నుంచి నేను పొందిన ప్రేమ, ఆశీర్వాదాలను నేను ఎప్పటికీ మరచిపోలేను. ఈ రోజు నేను మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మీ వల్ల నేను తల ఎత్తుకునే అవకాశం వచ్చింది. గత 10 సంవత్సరాలలో, నేను చాలా మంది ప్రపంచ నాయకులను కలుసుకున్నాను. వారందరూ తమ తమ దేశాల్లోని భారతీయ ప్రవాసులను అభినందిస్తున్నారు. దీని వెనుక పెద్ద కారణం మీ సామాజిక విలువలు” అని ప్రధాని మోదీ చెప్పారు.