ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలలో కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆధిపత్యం పట్ల అసహనం చెలరేగుతున్న సమయంలో, కూటమికి నాయకత్వం వహించేందుకు ముందుకు వస్తున్న టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీకి మద్దతు పెరుగుతున్న సమయంలో జరుగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా మిగిలింది.
హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఏకపక్ష ధోరణులే ప్రతిపక్షాల పరాజయంకు దారితీసిన్నట్లు భావిస్తున్న పలు పక్షాలు ఆ పార్టీకి దూరంగా జరుగుతున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికల కోసం జట్టుకట్టిన ఇండియా కూటమి పార్టీలు ప్రస్తుతం కాంగ్రెస్‌ను పట్టించుకోవడం లేదు.
టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ, శివసేన (యూబీటీ) వంటి ప్రధాన పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి మద్దతుగా నిలుస్తున్నట్లు తెలుస్తున్నది. ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఎక్స్ వేదికగా తెలిపిన సమాచారం ప్రకారం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ ఢిల్లీ శాసన సభ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ప్రకటించారు.
తమకు మద్దతిచ్చినందుకు మమతకు కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపారు. కష్టసుఖాల్లో అండగా ఉంటూ, ఆశీర్వదిస్తున్నందుకు మమత దీదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఇటీవల ఆరోపణలు చేయడంతో, ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఆప్ నిర్ణయించింది. బిజెపిని కాకుండా ఆప్ తమకు శత్రు పక్షం అని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పేర్కొనడం పట్ల కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలావుండగా, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో కేజ్రీవాల్ మంతనాలు జరుపుతున్నట్లు, ఉద్ధవ్ మరికొద్ది రోజుల్లో ఢిల్లీలో ఆప్ తరపున ప్రచారం చేయబోతున్నట్లు సమాచారం. 70 స్థానాలున్న ఢిల్లీ శాసన సభ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 5న, ఓట్ల లెక్కింపు వచ్చే నెల 8న జరుగుతాయి.
More Stories
మంత్రులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు
భార్యతో సెల్ఫీతోనే మావోయిస్టు చలపతి హతం!
పార్లమెంట్లో ఎన్ఆర్ఐలకు ప్రాతినిధ్యం కల్పించాయి