తెలంగాణ హైకోర్టు సీజే అలోక్‌ అరాధే బదిలీ

తెలంగాణ హైకోర్టు సీజే అలోక్‌ అరాధే బదిలీ
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అలోక్‌ అరాధేను బాంబే హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం మంగళవారం సిఫారసు చేసింది. ఆయన బదిలీపై వెళ్లిన తర్వాత జస్టిస్‌ సుజయ్‌ పాల్‌ తాతాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తారు. మరోవైపు, పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కే వినోద్‌ చంద్రన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల కొలీజియం మంగళవారం సమావేశమైంది. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్‌ ఉపాధ్యాయను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రానికి సిఫారసు చేసింది. జస్టిస్‌ మన్మోహన్‌ను సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి కల్పించడంతో ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ విభూ బఖ్రూ ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. 

గౌహతి హైకోర్టు అదనపు న్యాయమూర్తులు జస్టిస్‌ కర్దక్‌ ఈటే, జస్టిస్‌ మృదుల్‌ కుమార్‌ కలితాను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని కూడా కొలీజియం సిఫారసు చేసింది. 2011 నవంబర్‌ 8న కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ చంద్రన్‌ పేరును సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొలీజియం సిఫారసు చేసింది. ఈ సిఫార్సులను కేంద్రం ఆమోదిస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33కి పెరుగుతుంది. సుప్రీంకోర్టుకు మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 34. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీటీ రవికుమార్‌ ఈ నెల 3న పదవీ విరమణ చేశారు.

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ అరాధే గతేడాది జులైలో నియామకమయ్యారు. సీజేగా ఉన్న జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జస్టిస్‌ అలోక్‌ అరాధేను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఆయన పదోన్నతిపై తెలంగాణ హైకోర్టు సీజేగా బాధ్యతలు స్వీకరించారు.