మాజీ మంత్రి కేటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఏసీబీ విచారణకు వెళ్లేటప్పుడు లాయర్ను తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. కేటీఆర్ వెంట మాజీ అడ్వకేట్ జనరల్ జే రామచంద్రరావు వెళ్తారని న్యాయమూర్తికి తెలిపారు. విచారణ సమయంలో కనిపించే దూరంలో న్యాయవాది ఉంటారని జడ్జి తెలిపారు.
లైబ్రరీలో కూర్చుని విచారణను లాయర్ చూడవచ్చని ఏఏజీ వివరించారు. అయితే ఏసీబీ విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయించాలన్న కేటీఆర్ తరఫు న్యాయవాది వినతిని న్యాయస్థానం నిరాకరించింది. న్యాయవాదితో కలిసి రేపు విచారణకు వెళ్లాలని హైకోర్టు కేటీఆర్‌కు సూచించింది. రేపటి ఏసీబీ విచారణ తర్వాత ఏమైనా అనుమానాలుంటే మళ్లీ సంప్రదించవచ్చని హైకోర్టు పేర్కొంది.
ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ విచారణలో భాగంగా కేటీఆర్ తనతో పాటు తన న్యాయవాదిని అనుమతించాలని ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. కేటీఆర్ తరపున న్యాయవాది గతంలోనూ లాయర్ అనుమతికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. ఏపీ రాజకీయ నేత అవినాష్‌రెడ్డి విచారణ సందర్భంగా ఇదే హైకోర్టు అనుమతించిందన్న న్యాయవాది ప్రభాకర్ రావు న్యాయస్థానానికి తెలిపారు.
ఏసీబీ తరఫున ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్‌రెడ్డి కేటీఆర్తో పాటు న్యాయవాదిని అనుమతించొద్దంటూ వాదించారు. అయితే న్యాయవాదిని అనుమతిస్తే సమస్యేంటని ఏఏజీని కోర్టు ప్రశ్నించింది. అనంతరం ముగ్గురి పేర్లను ఇవ్వాలని కేటీఆర్ లాయర్కు సూచించింది. అనంతరం విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదావేసింది.
ఆ సమయానికి కేటీఆర్ తరపున న్యాయవాది రామచంద్రరావు వెళతారని ఆయన తరపు లాయర్ ప్రభాకర్ రావు తెలిపారు. దీనికి ధర్మాసనం అంగీకరించింది. దీంతో రేపు కేటీఆర్, తన లాయర్తో కలిసి ఏసీబీ కార్యాలయానికి వెళ్లనున్నారు.
ఏసీబీ నోటీసుల నేపథ్యంలో ఈనెల 6న మాజీ మంత్రి కేటీఆర్ తన న్యాయవాదులతో కలిసి హైదరాబాద్లోని ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. ఆ సందర్భంగా పోలీసులు లాయర్లను ఏసీబీ ఆఫీస్లోకి అనుమతించలేదు. దీంతో కేటీఆర్ విచారణకు హాజరుకాకుండా వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఈరోజు హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
More Stories
పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు
జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసం?
క్షమాపణలు చెప్పిన వేణు స్వామి