కెటిఆర్ హ‌ద్దులు దాటారు…నిధుల దుర్వినియోగం జ‌రిగింది

కెటిఆర్ హ‌ద్దులు దాటారు…నిధుల దుర్వినియోగం జ‌రిగింది
ఈ ఫార్ములా కార్ రేస్ వ్య‌వ‌హారంలో హెచ్ ఎం డి ఎ పరిధికి మించి డబ్బు బదిలీ చేసింద‌ని హైకోర్టు అభిప్రాయ‌ప‌డింది.. కేబినెట్‌ ఆమోదం లేని లావాదేవీలపై విచారణ జరగాలని హైకోర్టు సూచించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేసిన నేప‌ధ్యంలో జడ్జి లక్ష్మణ్ త‌న ఆర్డ‌ర్ కాపీలో సంచలన అంశాలు ప్రస్తావించారు. 
 
కేటీఆర్‌ ఆదేశాలతోనే చెల్లింపులు జరిగాయని అంటున్నారని, చెల్లింపులతో ఎవరు లబ్ధి పొందారో తెలియాలని హైకోర్టు అభిప్రాయపడింది. ఫార్ములా ఈ-రేస్‌ కేసు విచారణకు తగిన సమయం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుపై ఏసీబీ ఆధారాలు సేకరించాలని, ఫార్ములా ఈ-రేస్‌ కేసులో మేం ఇప్పడే జోక్యం చేసుకోమని హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది. 
 
ఈ-రేస్‌ వ్యవహారంలో ఏం జరిగిందో దర్యాప్తులో తేలుతుందని, ఈ తీర్పు కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌కు మాత్రమే వర్తిస్తుందని హైకోర్టు వెల్లడించింది. ఈ చెల్లింపుల వల్ల లబ్ది పొందింది ఎవరు అనే అంశంపై దర్యాప్తు జరగాల్సి ఉందని న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. ఇక ఈ కేసులో ప్రైమాఫేసియా నిరుపణ అయిందని చెబుతూ దీంతో అంతిమ లబ్దిదారుడు ఎవరో బయటకు రావాల్సి ఉందని తన ఆదేశాల్లో జస్టిస్ లక్ష్మణ్ స్పష్టం చేశారు. 
 
మరోవైపు ఈ కేసులో కేటీఆర్ తరఫు న్యాయవాది సిద్ధార్థ ధవే వాదిస్తూ  ఈ వ్యవహారంలో అధికార దుర్వినియోగం జరగలేదన్న వాదనలను హైకోర్టు అంగీకరించలేదు. అలాగే దవే ప్రస్తావించిన అంశాలు ఈ కేసుకు వర్తించవంటూ హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. దర్యాప్తు సంస్థల అధికారాలను కోర్టులు అడ్డుకోలేవని పేర్కొంది. అయితే.. ఎఫ్ఐఆర్ క్వాష్‌ చేయడానికి కొన్ని పరిమితులు ఉంటాయని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
 

మరోవంక, హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కేటీఆర్‌ సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. దానిపై రాష్ట్ర ప్రభుత్వం కేవియట్‌ దాఖలు చేసింది. దీంతో ఆయనకు అరెస్టు నుంచి రక్షణ లభించకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

 
మరోవైపు ఫార్ములా-ఈ రేసు తొలి ఒప్పందంలో స్పాన్సరర్‌గా ఉన్న ఏస్‌ నెక్ట్స్‌జెన్‌, దాని మాతృ సంస్థ గ్రీన్‌ కో కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు చేశారు. ఏపీ, తెలంగాణలో మొత్తం ఆరు చోట్ల ఏసీబీ బృందాలు సోదాలు చేశాయి. హైదరాబాద్‌లోని మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌లో; మచిలీపట్నంలోని కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. 
 
మచిలీపట్నంలోని గ్రీన్‌కో సంస్థ ఎండీ చలమలశెట్టి సునీల్‌ ఇంట్లో గ్రీన్‌కో, ఏస్‌ నెక్ట్స్‌ జెన్‌ కార్యాలయాలను నడుపుతున్నారు. స్థానిక పోలీసులకు సైతం సమాచారం ఇవ్వకుండా తెలంగాణ ఏసీబీ అధికారులు ఈ కార్యాలయంలోకి వెళ్లారు. అక్కడ పనిచేసే సిబ్బందిని మినహా ఎవరినీ లోపలికి అనుమతించలేదు. 
 
కార్యాలయంలోని కీలక రికార్డులు, కంప్యూటర్లు, ల్యాప్‌టా్‌పలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఫార్మలా-ఈ కారు రేసు కేసులో భాగంగానే గ్రీన్‌కో కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నట్లు అధికారులు మచిలీపట్నంలో చెప్పారు. ప్రతి అంశాన్ని పరిశీలించి, ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని తెలిపారు.