కెనడాకు అమెరికాలో విలీనం చేయాలన్న ట్రంప్

కెనడాకు అమెరికాలో విలీనం చేయాలన్న ట్రంప్

కెనడాను అమెరికాలో విలీనం చేసే ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్‌ మరోసారి తెరపైకి తీసుకువచ్చారు. కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా చేసే ప్రతిపాదనను ఆయన పునరుద్ధరించారు. కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రూడో రాజీనామా చేసిన కొన్ని గంటల తర్వాత ట్రంప్‌ ఈ ప్రకటన చేయడం గమనార్హం. 

తన పార్టీ లిబరల్‌ పార్టీ ఆఫ్‌ కెనడాలో వెల్లువెత్తుతున్న అసమ్మతి, ఒత్తిడి కారణంగా ట్రూడో సోమవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కెనడాలో ఈ ఏడాది చివరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు తాను ప్రధానిగా కొనసాగుతానని ట్రూడో మీడియాతో వెల్లడించారు.

2017- 2021 మధ్య మొదటిసారి ట్రంప్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సమయంలోనూ అమెరికా, కెనడాల మధ్య మెరుగైన సంబంధాలు లేవు. నవంబర్‌ 5న మార్‌-ఎ-లాగోలో ఎన్నికల విజయం అనంతరం ట్రూడో కలిసినప్పటి నుండి కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా చేర్చాలనే ఆలోచలోనే ఉన్నారు. 

ఆ తర్వాత చాలా సార్లు సోషల్‌మీడియా పోస్ట్‌లలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. ”అమెరికాలో 51వ రాష్ట్రంగా ఉండటం కెనడాలోని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారు. ఆ దేశానికి అధిక రాయితీలు ఇచ్చి అమెరికా నష్టపోవాల్సిన అవసరం లేదు. కెనడా ప్రధాని ట్రూడోకు ఈ విషయం తెలుసు కాబట్టే ఆయన రాజీనామా చేశారు. అమెరికాలో విలీనమైతే దిగుమతి సుంకాలు ఉండవు, పన్నులు తగ్గుతాయి. అంతేకాకుండా రష్యా, చైనాలకు చెందిన నౌకల నుంచి ఎలాంటి ముప్పు ఉండదు” అని తన సోషల్‌మీడియా ట్రూత్‌లో ట్రంప్ పేర్కొన్నారు.

‘కెనడా అమెరికాతో విలీనమైతే సుంకాలు ఉండవు, పన్నులు తగ్గుతాయి. ఆ దేశాన్ని చుట్టుముట్టే రష్యా, చైనా ఓడల ముప్పును సురక్షితంగా ఎదుర్కోగలవు’ అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. 

మరోవంక, అధ్యక్ష ఎన్నికల్లో రెండో సారి గెలుపొందిన వెంటనే ట్రంప్‌ తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే కెనడా, మెక్సికో, చైనా వస్తువులపై భారీ సుంకాలు విధిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికాలోకి అక్రమ వలసలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ నివారణకు ఇవి సహాయపడతాయని ఆయన చెప్పారు. 

మెక్సికో, కెనడాల నుంచి వచ్చే ప్రతి వస్తువుపై 25 శాతం సుంకం విధించే ఉత్తర్వులపై జనవరి 20 సంతకం చేస్తానని ట్రంప్ ప్రకటించారు. ఫెంటానిల్ స్మగ్లింగ్‌ను చైనా అరికట్టే వరకు ఆ దేశం నుంచి వచ్చే వస్తువులపై అదనంగా 10 శాతం సుంకం విధించాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రకటన తర్వాత ట్రంప్‌తో కెనడా ప్రధాని ట్రూడో భేటీ అయ్యారు. 

ఈ భేటీ సందర్భంగా ట్రూడోకు ట్రంప్‌ కీలక హెచ్చరికలు జారీ చేశారు. వలసలు, డ్రగ్స్‌ అక్రమ రవాణాలను సరిహద్దుల్లోనే కట్టడి చేయాలని, లేదంటే సుంకాలు పెంచుతామని హెచ్చరించారు. ఇందులో విఫలమైతే అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని సూచించారు. ఈ క్రమంలో ‘గవర్నర్‌ ఆఫ్‌ కెనడా’ అంటూ ట్రూడోపై వ్యంగ్యస్త్రాలు సంధించారు.

కాగా, గతేడాది కెనడా నుంచి అమెరికా దాదాపు 423 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. దీని వల్ల కెనడాలో 20 లక్షల మంది ఉద్యోగ, ఉపాధికి కలిగింది. ఒకవేళ, సుంకాలు పెంచితే ఉద్యోగాల్లో కోత తప్పదు.