సాధారణంగా మన దేశంలో పౌరులకు ఎంతో తీవ్రమైన నేరాలకు పాల్పడితే తప్ప ఉరిశిక్షలు పడవు. అందుకే మన దేశంలో సగటున ఏడాదికి సింగిల్ డిజిట్‌కు మించి ఉరిశిక్షలు అమలుకావు. కానీ ఇరాన్‌లో ఏటికేడు ఉరిశిక్షలకు గురయ్యే వ్యక్తుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. గత సంవత్సరం అంటే 2024 అయితే ఏకంగా 900 మందికిపైగా ఉరితీశారు.
అక్కడ ఏడాదిలో మొత్తం 901 మందిని ఉరితీసినట్లు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల చీఫ్ ఓల్కర్ టర్క్ ఆవేదన వ్యక్తం చేశారు. 2024లో ఆ దేశంలో 834మందిని ఉరితీశారు. ఇరాన్‌లో హత్యలకు పాల్పడినా, మాదకద్రవ్యాలను రవాణా చేసినా, అత్యాచారాలు, లైంగిక దాడులకు పాల్పడినా ఉరిశిక్ష విధిస్తారు. దాంతో ఏటా భారీ సంఖ్యలో ఉరిశిక్షలు అమలవుతున్నాయి.
అయితే ఈ ఉరిశిక్షలపై హక్కుల సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సమాజంలో భయం నింపడానికి ఇలాంటి పెద్ద పెద్ద శిక్షలు వేయిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా 2022, 2023 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తడం కూడా మరణశిక్షలు పెరగడానికి కారణమని ఆరోపిస్తున్నారు.
ఇరాన్‌లో ఉరికంబం ఎక్కుతున్నది కేవలం పురుషులే అనుకుంటే కూడా పొరపాటేనని, ఎందుకంటే అక్కడ ఉరితీయబడుతున్న వారిలో మహిళలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటున్నారని టర్క్ చెప్పారు. ఈ విషయాన్ని నార్వే స్థావరంగా పనిచేస్తున్న ఇరాన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వెల్లడించిందని తెలిపారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం ఇరాన్‌లో 2024లో ఏకంగా 31 మంది మహిళలను ఉరితీశారని చెప్పారు.
ఏదిఏమైనా తాము ఉరిశిక్షల అమలుకు పూర్తి వ్యతిరేకమని టర్క్ స్పష్టం చేశారు. భారీఎత్తున ఉరిశిక్షలు అమలు చేయడంవల్ల కొందరు అమాయకులు కూడా మరణించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఉరిశిక్షలపై ఇరాన్ సర్కారు సమీక్ష నిర్వహించాలని, అప్పటిదాకా ఉరిశిక్షల అమలుపై మారటోరియం విధించాలని టర్క్ కోరారు.
More Stories
2025లో ప్రమాదంలో 47 కోట్ల మంది పిల్లల భవిష్యత్తు
40 ఏళ్ల తర్వాత ట్రంప్ ప్రమాణ స్వీకార వేదిక మార్పు
మరణం నుంచి తృటిలో తప్పించుకున్నాను