చిత్ర పరిశ్రమను వివాదాల్లోకి లాగకండి కేటీఆర్

చిత్ర పరిశ్రమను వివాదాల్లోకి లాగకండి కేటీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇటీవల జరిగిన సినీ ప్రముఖుల భేటీపై కేటీఆర్ వ్యాఖ్యలు బాధాకరమని పేర్కొంటూ చిత్ర పరిశ్రమను వివాదాల్లోకి లాగొద్దని ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు కోరారు. తెలుగు చిత్ర పరిశ్రమను అనవసర వివాదాల్లోకి లాగొద్దని, రాజకీయాలను ఆపాదించొద్దని ఆయన హితవు చెప్పారు. 

రాజకీయ దాడి, ప్రతిదాడులకు పరిశ్రమను వాడుకోవద్దన్న దిల్ రాజు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ పరిశ్రమ భేటీ చాటుమాటు వ్యవహారం కాదని స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమ బాగోగులపై స్నేహపూర్వక చర్చ జరిగిందని వెల్లడించారు. తెలంగాణ సీఎంతో భేటీపై చిత్ర పరిశ్రమ సంతృప్తిగా ఉందని దిల్ రాజు తెలిపారు.

కాగా హీరో అల్లు అర్జున్ వ్యవహారంపై తెలంగాణ మాజీమంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మరోసారి స్పందిస్తూ  కేవలం ప్రచారం కోసమే సినిమా వాళ్ల గురించి సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారని ఆరోపించారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించారంటూ ధ్వజమెత్తారు. అటెన్షన్, డైవర్షన్ కోసమే సీఎం రేవంత్‌రెడ్డి పాకులాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. పైగా, సీఎం రేవంత్ రెడ్డి సినిమా వాళ్లతో సెటిల్మెంట్ చేసుకుని ఇప్పుడు ఏం మాట్లాడట్లేదని ఆరోపించారు.

‘‘గౌరవ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిగారితో జరిగిన తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశంపై గౌరవ మాజీ మంత్రి కేటీఆర్‌గారు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. గౌరవ సీఎంగారితో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుమాటున జరిగిన వ్యవహారం కాదని అందరికీ తెలిసిందే” అంటూ కేటీఆర్ ఆరోపణలపై  దిల్ రాజు ఆక్షేపణ వ్యక్తం చేశారు. 

“తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా, ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన ఈ సమావేశం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ చాలా సంతృప్తిగా ఉంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పయనంలో తెలుగు చిత్ర పరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించి, రాష్ట్రాభివృద్ధికి, సామాజిక సంక్షేమానికి, మా బాధ్యతగా తగిన సహకారం అందజేయాలని సీఎంగారు కాంక్షించారు” అంటూ ఆయన చెప్పుకొచ్చారు.