కూల్చివేతలు చేపట్టిన ల్యాండ్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు ఎలా చెబుతున్నారని ప్రశ్నించింది న్యాయస్థానం. ఆధారాలు ఉన్నాయా? అని హైడ్రాను నిలదీసింది. పిటిషనర్ వద్ద అన్ని డాక్యూమెంట్స్ ఉన్నాయి కదా? అని హైడ్రాను ప్రశ్నించింది కోర్టు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధి తేల్చకుండా కూల్చివేతలు ఎలా చేపడతారని నిలదీసింది.
కమిషనర్‌కు చెప్పి కూల్చివేతలు ఆపివేయాలని ఆదేశించారు న్యాయమూర్తి. లేదంటే తాము ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేస్తామని తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటివి పునరావృతం అయితే కమిషనర్ రంగనాథ్‌పై తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు న్యాయమూర్తి.
ఇదే సమయంలో పిటిషనర్‌కు కూడా కీలక ఆదేశాలిచ్చింది హైకోర్టు ధర్మాసనం. పిటిషనర్ కూడా జీహెచ్ఎంసీ అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని స్పష్టం చేశారు. పిటిషనర్ వేసిన తాత్కాలిక ఫెన్సింగ్ కూడా 24 గంటల్లో పిటిషనరే తొలగించాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
అంతకు ముందు మంగళవారం ఉదయం గచ్చిబౌలిలోని ఖాజాగూడ భగీరథమ్మ, తౌతానికుంట చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. చెరువు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లోని నిర్మాణాలను హైడ్రా సిబ్బంది కూల్చేశారు. ఖాజాగూడ సర్వే నంబరు 18 ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో తొమ్మిది ఎకరాలు, ఏడు గుంటల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారు.
రెండు చెరువుల ఆక్రమణలు తొలగించి 10 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పరిశీలించి 20కి పైగా దుకాణాలను అధికారులు తొలగించారు. కూల్చివేతల నేపథ్యంలో భారీ బందోబస్తు చేపట్టారు. మరోవైపు నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే దుకాణాలు కూల్చేయడంపై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత తక్కువ సమయంలో ఎలా ఖాళీ చేయాలంటూ వాపోయారు.

More Stories
మామిడి ఫలాల మాటున ప్రాణాంతకమైన విషపు కోరలు?
కాంగ్రెస్ నేతకు రామాలయం ధారాదత్తం
డ్రగ్స్ కేసులో ఐఎఎస్ అధికారిణి కుమారుడు