
భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత డా. మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. దేశం గొప్పనేతను కోల్పోయిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మన్మోహన్‌సింగ్ మృతికి 7 రోజులు సంతాప దినాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
“విద్య, పరిపాలనను సమానంగా విస్తరింపజేసిన అరుదైన రాజకీయ నాయకుల్లో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఒకరు. భారత ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో కీలకపాత్ర పోషించారు. దేశానికి ఆయన చేసిన సేవ, ఆయన రాజకీయం జీవితం, వినయంతో కూడిన నడవడిక ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన మృతి దేశానికి తీరనిలోటు. భరతమాత ముద్దుబిడ్డల్లో ఒకరైన మన్మోహన్‌కు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నా” అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులు అర్పించారు.
“మన్మోహన్ సింగ్ ఇక లేరన్న విషయం చాలా బాధకు గురిచేసింది. ఆయన భారత దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చారు. ఆర్థిక సరళీకరణ రూప శిల్పిగా పేరు గడించారు. ఎంతో ధైర్యం ప్రదర్శించి కఠిన నిర్ణయాలతో దేశం ముందుకు సాగేలా చేశారు. దేశ అభివృద్ధికి ఎన్నో ద్వారాలు తెరిచారు. ఉప రాష్ట్రపతిగా ఆయనతో ఎన్నో సంభాషణలు జరిపాను. ఆర్థిక విధానం పట్ల ఆయనకున్న ప్రగాఢ విశ్వాసం, దేశ పురోగతి పట్ల అచంచల నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతాయి. భారత దేశం మహోన్నతమైన వ్యక్తిని కోల్పోయింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి” అని ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ సంతాపం వ్యక్తం చేశారు.
“భారత దేశం విశిష్టమైన వ్యక్తుల్లో ఒకరైన మన్మోహన్ సింగ్‌ను కోల్పోయింది. ఎంతో నిరాడంబరంగా ఉండే ఆయన ఆర్థికవేత్తగా ఎదిగారు. ప్రధానిగానే కాకుండా ఆర్థిక మంత్రితో పాటు ఎన్నో ప్రభుత్వ విభాగాల్లో పనిచేశారు. దేశ ఆర్థిక విధానంపై ఎన్నో ఏళ్లుగా బలమైన ముద్రవేశారు. పార్లమెంట్‌లో ఆయన ప్రసంగాలు గొప్పగా ఉండేవి. ప్రధానిగా దేశ ప్రజల జీవితాలు మెరుగుపరిచేందుకు ఎంతో కృషి చేశారు” అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
“మన్మోహన్ ప్రధానిగా, నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరుచూ మాట్లాడుకునేవాళ్లం. పాలనకు సంబంధించిన పలు అంశాలపై చర్చించేవాళ్లం. ఆయన జ్ఞానం, వినయం ఎల్లప్పుడూ ప్రస్ఫుటించేవి. ఈ సమయంలో నా ఆలోచనలన్నీ ఆయన కుటుంబం చుట్టూ తిరుగుతున్నాయి” అని మోదీ పేర్కొన్నారు.
“గురువు, మార్గదర్శిని కోల్పోయాను. అపార జ్ఞానం, సమగ్రతతో మన్మోహన్ సింగ్ దేశాన్ని నడిపించారు. ఆర్థికశాస్త్రంలో ఆయన లోతైన అవగాహన దేశానికి స్ఫూర్తి. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి” అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంతాపం తెలిపారు. “దేశం దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది. మన్మోహన్ ఆర్థిక విధానాలు దేశంలో పేదరికాన్ని తగ్గించాయి. మన్మోహన్‌ను దేశం ఎప్పుడూ కృతజ్ఞతతో గుర్తుపెట్టుకుంటుంది” అని కొనియాడారు.
“రాజకీయాల్లో కొంత మంది నేతలు మంది మాత్రమే స్ఫూర్తిగా నిలుస్తారు. వారిలో ఒకరు మన్మోహన్ సింగ్. ఆయన నిజాయతీ మాకు ఎప్పుడూ ఒక స్ఫూర్తిగా ఉంటుంది. ప్రతిపక్షాలు ఎప్పుడు విమర్శలు చేసినా నిబద్ధతతో దేశానికి సేవ చేశారు. ఆయన ఎంతో తెలివైన, ధైర్యసాహసాలు కలిగిన వ్యక్తి. కఠినమైన రాజకీయ ప్రపంచంలో ప్రత్యేక గౌరవప్రదమైన, సున్నిత వ్యక్తిగా చివరి వరకు కొనసాగారు” అంటూ ప్రియాంక గాంధీ వాద్రా సంతాపం తెలిపారు.
“మాజీ ప్రధాని, ఆర్థికవేత్త అయిన మన్మోహన్‌సింగ్ మరణం దేశానికి తీరని లోటు. భారత రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడు. అణగారిన వర్గాల కోసం నిరంతరం తపించారు. పార్టీలకు అతీతంగా ఆయన నాయకత్వం గౌరవాన్ని పొందింది. ఆయన వారసత్వం దేశ నిర్మాణంలో భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి” అని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా నివాళులు అర్పించారు.
“ఆర్థికవేత్తగా, రిజర్వు బ్యాంక్ గవర్నర్‌గా, ఆర్థిక మంత్రిగా దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలకు దిశానిర్దేశం చేసిన మన్మోహన్ సింగ్ చిరస్మరణీయులు. వ్యక్తిగతంగా నాకు ఎంతో ఆత్మీయులు. వారి నిబద్ధత, క్రమశిక్షణ, నిరాడంబరత ఆదర్శమైనవి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి” అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు.
More Stories
జమ్ముకశ్మీర్లో 12 మంది పాక్ చొరబాటుదారులు కాల్చివేత
రామ జన్మభూమిలో తొలి `కరసేవక్’ కామేశ్వర చౌపాల్ మృతి
ఐదేళ్లలో తొలిసారి వడ్డీ రేట్లు తగ్గింపు