అతి పిన్న వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా దొమ్మరాజు గుకేశ్ రికార్డు సృష్టించాడు. 18 ఏళ్ల వయసులోనే ఫిడె ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ సొంతం చేసుకున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన చైనాకు చెందిన డింగ్ లిరెన్‌తో జరిగిన తుది పోరులో విజేతగా నిలిచాడు.
గురువారం జరిగిన 14వ రౌండ్ (చివరి క్లాసికల్ గేమ్)లో డింగ్ 6.5 పాయింట్లు సాధించగా గుకేశ్ 7.5 పాయింట్లు సాధించాడు. 2012లో విశ్వనాథ్ ఆనంద్ తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకున్న రెండో భారతీయుడిగానూ గుకేశ్ చరిత్ర సృష్టించాడు. సింగపూర్‌లో జరిగిన ఫిడే ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలో డింగ్ లిరెన్, గుకేశ్ మధ్య గట్టి పోటీనే జరిగింది.
వీరిద్దరి మధ్య బుధవారం జరిగిన 13వ రౌండ్‌లోనే ఫలితం తేలాల్సి ఉంది. కానీ ఇద్దరూ ఒకరి ఎత్తులను మరొకరు చిత్తు చేస్తూ దాదాపు 5 గంటల పాటు ఉత్కంఠగా పోటీ పడ్డారు. అయినప్పటికీ ఇద్దరూ చెరో 6.5 పాయింట్లతో సమానంగా పోటీ పడ్డారు. దీంతో 68 ఎత్తుల తర్వాత ఇద్దరు ఆటగాళ్లు ఫలితం తేలకుండానే గేమ్ ముగించేందుకు అంగీకరించారు.
ఇప్పటి వరకు విశ్వనాథన్ ఆనంద్ ఐదు సార్లు వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవగా ఎట్టకేలకు ఈ ఘనత సాధించిన రెండో భారత ప్లేయర్‌గా దొమ్మరాజు గుకేశ్ నిలిచాడు. సింగపూర్ వేదికగా జరిగిన వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో చైనాకి చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ హోరాహోరీగా తలపడిన దొమ్మరాజు గుకేశ్ సుదీర్ఘ పోరాటం తర్వాత ఎట్టకేలకు తన చిరకాలస్వప్నం నెరవేర్చుకున్నాడు.
గురువారం జరిగిన చివరి క్లాసికల్ గేమ్‌లో డింగ్ లిరెన్ 6.5 పాయింట్లు సాధించగా గుకేశ్ 7.5 పాయింట్లు స్కోర్ చేసి విజేతగా నిలిచాడు. చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకున్న తర్వాత గుకేశ్ మీడియాతో మాట్లాడుతూ ఓ వైపు ఆనందం వ్యక్తం చేస్తూనే మరోవైపు ఎమోషనల్ అయ్యాడు. గత 10 ఏళ్లుగా ఈ క్షణం కోసం కలలు కంటున్నానని పేర్కొన్నాడు. ఇప్పుడీ కలను సాకారం చేసుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్పాడు. “నేను గెలుస్తానని అస్సలు అనుకోలేదు. అందుకే చాలా ఎమోషనల్ అయ్యాను. 10 ఏళ్ల నుంచి ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నాను. ఇప్పుడీ కల నిజమైనందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. నా దృష్టిలో డింగే రియల్ ఛాంపియన్. నేను నా ప్రత్యర్థికి థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నాను. ” అని గుకేశ్ ఆనందం వ్యక్తం చేశారు.
గుకేశ్ పెరిగింది తమిళనాడులోని చెన్నైలో అయినప్పటికీ అతని స్వస్థలం ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా. గుకేశ్ తండ్రి రజినీకాంత్ సర్జన్. ఏడేళ్ల వయసులోనే గుకేశ్ చెస్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. అదే మక్కువతో చెస్ పోటీల్లో అనేక విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే ఏసియన్ చెస్ ఫెడరేషన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2023గా రికార్డు సృష్టించాడు. తాజాగా 18 ఏళ్ల వయసులో చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు.
గుకేశ్కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అతడి విజయం చరిత్రాత్మకం, ఆదర్శవంతమని కొనియాడాడు. అంతేకాకుండా గుకేశ్ అసాధారణ ప్రతిభ, కృషి, సంకల్పమే ఈ ఫలితమని, గుకేశ్ భవిష్యత్ ప్రయత్నాలకు నా శుభాకాంక్షలంటూ మోదీ ట్వీట్ చేశారు.
‘‘మన తెలుగు కుర్రాడు, ఇండియన్ గ్రాండ్‌మాస్టర్‌కి హృదయపూర్వక అభినందనలు. కేవలం 18 ఏళ్లకే ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్‌గా అవతరించి సింగపూర్ వేదికగా చరిత్ర సృష్టించడం గర్వకారణం. మీ అద్భుతమైన విజయాన్ని దేశం మొత్తం సంబరంగా జరుపుకుంటోంది. రాబోయే దశాబ్దాలలో మీరు మరెన్నో విజయాలు, ప్రశంసలు పొందాలని కోరుకుంటున్నాను’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ద్వారా అభినందించారు.
More Stories
ఇస్రో మరో ఘనత.. స్పేడెక్స్ డాకింగ్ విజయవంతం
సంచలన ఆరోపణలు చేసే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మూసివేత
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దుండగుడి దాడి