రోడ్ ప్రమాదాలు పెరుగుతుండటం పట్ల సిగ్గుపడుతున్నా!

రోడ్ ప్రమాదాలు పెరుగుతుండటం పట్ల సిగ్గుపడుతున్నా!
దేశంలో రోజు రోజుకూ యాక్సిడెంట్ల సంఖ్య పెరుగుతున్న‌ట్లు సంబంధిత మంత్రిగా తాను సిగ్గుపడుతున్నట్లు కేంద్ర రోడ్డు, ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ తెలిపారు. ప్ర‌మాదాల నివార‌ణ‌పై లోక్‌స‌భ‌లో స‌మాధానం ఇస్తూ విదేశాల్లో జ‌రిగే స‌మావేశాల‌కు వెళ్లిన స‌మ‌యంలో రోడ్డు ప్ర‌మాదాల‌పై చ‌ర్చ జ‌రుగుతున్న‌ప్పుడు త‌న ముఖాన్ని దాచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని మంత్రి చెప్పారు. 
 
తొలి సారి కేంద్ర రోడ్డు ర‌వాణా, హైవే శాఖ మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన స‌మ‌యంలో  ప్ర‌మాదాల‌ను 50 శాతం వ‌ర‌కు త‌గ్గించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నానని ఆయన వెల్లడించారు. కానీ ప్ర‌మాదాల‌ను త‌గ్గించ‌డం కాదు క‌దా, వాటి సంఖ్య పెరుగుతోంద‌ని చెప్ప‌డానికి సిగ్గుప‌డ‌డం లేద‌ని మంత్రి స్పష్టం చేశారు.

రోడ్డు ప్ర‌మాదాల‌పై అంత‌ర్జాతీయ స‌మావేశాల్లో చ‌ర్చ‌లు జ‌రిగే స‌మ‌యంలో త‌న ముఖాన్ని దాచుకోవాల్సి వ‌స్తోంద‌ని మంత్రి చెప్పారు. ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ఓ అనుబంధ ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ భార‌త్‌లో మ‌నుషుల ప్ర‌వ‌ర్త‌న మారాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు. స‌మాజం చాలా మారాల‌ని, రోడ్డు నిబంధనలను అంద‌రూ గౌర‌వించాల‌ని ఆయన చెప్పారు. 

కొన్నేళ్ల క్రితం కుటుంభం సభ్యులతో కలిసి ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో త‌న వాహనానికి ప్రమాదం జ‌రిగింద‌ని, అప్పుడు చాలా రోజులు ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకున్న‌ట్లు గుర్తుచేస్తూ ప్ర‌మాదాల‌పై తనకు వ్య‌క్తిగ‌త అనుభ‌వం ఉన్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. రోడ్ల‌పై ట్ర‌క్కుల పార్కింగ్ వ‌ల్ల ప్ర‌మాదాలు జ‌రుగుతున్న‌ట్లు మంత్రి చెప్పారు. 

చాలా వ‌ర‌కు ట్ర‌క్కులు లేన్ డిసిప్లేన్ పాటించ‌డం లేద‌ని పేర్కొంటూ బ‌స్సు బాడీని త‌యారు చేసే విష‌యంలో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌ను పాటించాల‌ని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. బ‌స్సు విండో ద‌గ్గ‌ర సుత్తె ఉండాల‌ని, ఎందుకంటే ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో దాని ద్వారా త‌ప్పించుకోవ‌చ్చు ఆయన సూచించారు.  దేశంలో ప్ర‌తి ఏడాది రోడ్డు ప్ర‌మాదాల వ‌ల్ల సుమారు 1.78 ల‌క్ష‌ల మంది మ‌ర‌ణిస్తున్న‌ట్లు చెప్పారు. దీంట్లో 60 శాతం మంది బాధితులు 18 నుంచి 34 ఏళ్ల మ‌ద్య వ‌య‌సు వారుని పేర్కొంటూ ప్ర‌మాదాల జాబితాలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లీడింగ్‌లో ఉన్న‌ది. న‌గ‌రాల్లో ఢిల్లీ అగ్ర‌స్థానంలో ఉన్న‌దని తెలిపారు. 

యూపీలో రోడ్డు ప్ర‌మాదాల వ‌ల్ల ప్ర‌తి ఏడాది 23 వేల మంది మ‌ర‌ణిస్తున్నారని, అంటే సుమారు 13.7 శాతం అని చెప్పారు. ఆ త‌ర్వాత జాబితాలో త‌మిళ‌నాడు ఉందని,  ప్ర‌తి ఏడాది 18 వేల మంది మ‌ర‌ణిస్తున్నారని, ఇది మొత్తంలో 10.6 శాతం అని తెలిపారు. మ‌హారాష్ట్ర‌లో ప్ర‌తి ఏడాది 15 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. 

ఆ త‌ర్వాత మ‌ధ్య‌ప్ర‌దేశ్(13వేలు) ఉన్న‌ది. ఢిల్లీ నగరంలో ప్ర‌తి ఏడాది 1400 మంది మ‌ర‌ణిస్తున్నారు. బెంగుళూరు రెండో స్థానంలో ఉన్న‌ది ఆ సిటీలో 915 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. జైపూర్‌లో ఏడాదికి 850 మంది మ‌ర‌ణిస్తున్నారు. అత్యంత సులువుగా డ్రైవింగ్ లైసెన్సు దొరికే దేశం మ‌న‌దే అని చెప్ప‌డానికి సంకోచించ‌డం లేద‌న్నారు. కానీ జ‌నాల్లో డ్రైవింగ్ సెన్స్ లేద‌ని కేంద్ర మంత్రి విచారం వ్యక్తం చేశారు.