లగచర్ల గిరిజన రైతుకు సంకేళ్లపై ఆగ్రవేశాలు

లగచర్ల గిరిజన రైతుకు సంకేళ్లపై ఆగ్రవేశాలు
* నష్ట నివారణ చర్యగా సీఎం … జైలర్ సస్పెన్షన్
 
వికారాబాద్ కలెక్టర్‌పై లగచర్లలో జరిగిన దాడి కేసులో కంది జైలులో నిందితుడిగా ఉన్న గిరిజన రైతు హీర్యా నాయక్‌కు ఛాతి నొప్పి రావడంతో సంగారెడ్డిలో జిల్లా ఆస్పత్రికి గురువారం తరలించారు. ఈ క్రమంలో జైలు సిబ్బంది అతనికి బేడీలు వేసి తీసుకురావడం పట్ల ఆగ్రవేశాలు చెలరేగాయి. తనకు ఛాతి నొప్పి వస్తుందని చెప్పడంతో బుదవారం ఒక సారి జిల్లా ఆస్పత్రికి తరలించి పరీక్షలు జరిపారు. 
 
ఈ పరీక్షలో నార్మల్‌గా ఉందని తేల్చారు. అయినప్పటికి మరోసారి గురువారం తీసుకురావాలని వైద్యులు సూచించారు. దీంతో గురువారం తిరిగి జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ సమయంలో అతనికి బేడీలు వేసి ఉండడం మీడియా కంటపడింది. దీంతో ఒక్కసారిగా దుమారం చెలరేగింది.  వైద్యుల సూచన మేరకు గాంధీ ఆస్పత్రికి తరలించే సమయంలో మాత్రం బేడీలను తొలగించారు.
 
స్ట్రెచర్ మీదనో, అంబులెన్స్ మీదనో తీసుకురావాల్సిన మనిషిని బేడీలు వేసి తీసుకువచ్చారని విమర్శలు చెలరేగుతున్నాయి. సంకెళ్లు వేసి తీసుకురావడం భావ్యంకాదని గతంలో కోర్టులు తీర్పు చెప్పినా కూడా పోలీసులు రైతు హీర్యానాయక్‌కు సంకెళ్లు వేయడం పట్ల పలువురు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గ వైఖరి వెల్లడైందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. రైతు హీర్యా నాయక్ ఉగ్రవాదా..? లేక దోపిడీ దొంగనా? అని మండిపడుతున్నాయి. ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యం?ఇదేనా మీ ప్రజాపాలన? అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీయడం ప్రారంభించాయి.

హీర్యా నాయక్ కి గుండెల్లో నొప్పి వస్తే వైద్య సహాయం అందించడంలో ప్రభుత్వం అలసత్వం చూపిందని మండిపడుతున్నారు. ఈ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులకు, బయటకు చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేసిందని ఆరోపణలు చెలరేగుతున్నాయి. సకాలంలో ఆసుపత్రికి తరలించకుండా అమానవీయంగా వ్యవహరించిందని విమర్శలు చెలరేగాయి.

లగచర్ల రైతు హీర్యానాయక్‌ను చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి బేడీలతో తీసుకెళ్లడంపై సర్వత్రా ఆగ్రవేశాలు వ్యక్తం అవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నష్టనివారణ చర్యలకు పూనుకున్నారు. ఘటనపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.  రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని అధికారులపై సీరియస్ అయ్యారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహిందని స్పష్టం చేశారు. హీర్యానాయక్ అంశంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.

రైతుకు బేడీలు వేసిన ఘటనలో సంగారెడ్డి జైలర్ సంజీవరెడ్డిని సస్పెండ్ చేస్తూ జైళ్ల శాఖ డిజి సౌమ్య మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై విచారించిన ఐజి సత్యనారాయణ విచారణ ఖైది హీర్యా నాయక్‌ను లగచర్ల రైతుగా పేర్కొనకుండా బాలానగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఒక కేసులో నిందితుడిగా చూపడం వల్లనే అతనికి బేడీలు వేసినట్లు బయటపడిందని తెలిపారు. ఈ ఘటనలో జైలు అధికారుల తప్పిదం అడుగడుగునా కనిపించిందని ఆయన పేర్కొన్నారు.

కలెక్టర్‌పై దాడి చేసిన ఘటనలో రైతు హీర్యానాయక్‌తో 14 మంది రైతులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. వీరంతా ప్రస్తుతం సంగారెడ్డి జైలులో విచారణ ఖైదీలుగా ఉండగా, ఇందులో హీర్యానాయక్ పై బిఎన్‌ఎఎస్ (భారత్ న్యాయ్ సంహిత) సెక్షన్ 191 కింద కేసు నమోదు అయింది. 

కాగా ఈ సెక్షన్ తీవ్రమైన నేరం కాకపోవడంతో నిందితునికి బేడీలు వేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే అంశం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. బిఎన్‌ఎస్ సెక్షన్ 191 కింద కేసు నమోదు చేసిన నిందితునికి బేడీలు వేయడం రాజ్యాంగంలోని 14,16, 19 ఆర్టికల్స్‌కు విరుద్దమని నిందితుని తరఫు న్యాయవాదులు తప్పుపట్టారు. ఇది నూతన క్రిమినల్ చట్టానికి, పోలీసు, జైలు మాన్యువెల్స్‌కు కూడా విరుద్దమని, పైగా అండర్ ట్రయల్ ఖైదీల హక్కులను హరించడమే అవుతుందని ఆక్షేపించారు.

లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటును వెనక్కి తీసుకున్న సర్కార్‌, రైతుల పైనా పెట్టిన కేసులను సైతం వెనక్కి తీసుకోవాలని నిందితుల తరపు న్యాయవాది తెలిపారు. మరోవైపు తమ బిడ్డకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని హీర్యానాయక్‌ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.