తెలంగాణ ప్రాజెక్టులకు సహకరించండి కిషన్ రెడ్డి

తెలంగాణ ప్రాజెక్టులకు సహకరించండి కిషన్ రెడ్డి

తెలంగాణాలో వివిధ రకాల అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చేందుకు కృషి చేయాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్), హైద్రాబాద్ మెట్రో ఫేజ్ 2 తోపాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్లాన్, సింగరేణి సంస్థకు బొగ్గు గనుల కేటాయింపు సహా పలు అంశాలపై కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి చర్చించారు. 

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం కలిశారు. ఈ సందర్భంగా మొత్తం రూ.1,63,559. 31 కో ట్ల విలువైన ప్రాజెక్టుల విషయంలో కేంద్రం నుంచి కావాల్సిన చేయూతపై చర్చించారు. ఆర్‌ఆర్‌ఆర్ నిర్మిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2022లోనే ప్రకటించిన విషయాన్ని రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 

ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం భూ సేకరణను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని, త్రైపాక్షిక ఒప్పందం పూర్తయినా ఇప్పటి వరకు ఎన్‌హెచ్‌ఏఐ అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగానికి ఇంకా అనుమతి ఇవ్వని విషయాన్ని కేంద్ర మంత్రికి సీఎం గుర్తు చేశారు. ఆర్‌ఆర్‌ఆర్ రెండు వైపులా పూర్తికి ఈ రహదారికి సంబంధించి వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న అనుమతులన్నీ ఇప్పించేందుకు కృషి చేయాలని కోరారు.

ఈ మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.34,367.62 కోట్లు అని తెలిపారు. 10 గ్రీన్‌ఫీల్ రోడ్లతో పాటు ఓఆర్‌ఆర్ అనుసంధానించే మెట్రో కారిడార్ రేడియల్ రోడ్లకు రూ.45 వేల కోట్లు వ్యయమవుతాయని సీఎం వివరించారు.  మెట్రో ఫేజ్ 2 లో భాగంగా  మొత్తం 76.4 కి.మీల నిర్మించనున్న మెట్రో రైలు నిర్మాణానికి రూ.24,269 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసినట్లు రేవంత్ రెడ్డి వివరించారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 50: 50 వాటాతో మెట్రో ఫేజ్‌ను 2 చేపట్టేందుకు సీఎం కోరారు.

మూసీరివ్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ ప్రిధిలోని 222.27 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ఇప్పటికే కోరిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆ భూముల బదలాయింపుతో పాటు గాంధీ సరోవర్ నిర్మాణం, మూసీ సీవరేజీ ప్రాజెక్టులు, 11 హెరిటేజ్ వంతెనల నిర్మాణంతో పాటు ఇతర పనులకు రూ.14,100 కోట్లు వ్యయమవుతాయని అంచనా వేశామని చెప్పారు. తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్లాన్‌ను రూపకల్పన చేశామని, రూ.4.170 కోట్ల వ్యయమయ్యే ఈ ప్లాన్‌ను అమృత్ 2 లేదా ప్రత్యేక పథకం కింద చేపట్టాని కోరారు.