సంధ్య థియేటర్‌ ఘటనలో అల్లు అర్జున్‌ అరెస్ట్‌

సంధ్య థియేటర్‌ ఘటనలో అల్లు అర్జున్‌ అరెస్ట్‌
సంధ్య థియేటర్‌ కేసులో హీరో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. పుష్ప -2 రిలీజ్‌ సందర్భంగా ఈ నెల 4వ తేదిన సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో  రేవతి (39) అనే మహిళ మృతి చెందగా. ఆమె కుమారుడు శ్రీతేజ్‌ (9)కు గాయాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో శ్రీతేజ్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అల్లు అర్జున్‌పై ఇప్పటికే నమోదు చేయగా, తాజాగా ఈ కేసులో చిక్కడ పల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పీఎస్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనలో పోలీసులు ఇటీవలే ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. సెక్యూరిటీగార్డ్‌ సహా థియేటర్‌ యజమాన్యానికి చెందిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

అల్లు అర్జున్‌పై బీఎన్‌ఎస్‌ 118 (1), బీఎన్‌ఎస్‌ 105, రెడ్‌విత్‌ 3/5 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. 105 సెక్షన్‌ (నాన్‌ బెయిలబుల్‌ కేసు) కింద ఐదు నుంచి పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన అల్లు అర్జున్‌ ఇప్పటికే ఆమె రూ.25 లక్షలు సాయం ప్రకటించాడు. ఆమె కుటుంబానికి అండగా నిలుస్తానని పేర్కొన్నాడు.

కాగా చికడపల్లి పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలంటూ ఇప్పటికే థియేటర్‌ యాజమాన్యం, భాగస్వాములు పిటిషన్లు దాఖలు చేశారు. ఆ తర్వాత అల్లుఅర్జున్‌ కూడా పిటిషన్‌ దాఖలు చేశాడు. సినిమా విడుదల సందర్భంగా థియేటర్లకు నటులు వెళ్తుంటారని, ఇది సహజంగా జరిగేదేనని తెలిపాడు.

ఇదివరకు కూడా పలుమార్లు సినిమా ప్రదర్శనల సమయంలో తాను వెళ్లానని, ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోలేదని అల్లు అర్జున్‌ తెలిపాడు. సంధ్య థియేటర్‌కు వెళ్లేముందు తాను థియేటర్‌ నిర్వాహకులకు, స్థానిక ఏసీపీ తదితర పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చినట్టు పేర్కొన్నారు. భద్రత కోసం ముందస్తుగా సమాచారం ఇచ్చామని, ఇందులో తన నిర్లక్ష్యమేమీ లేదన్నాడు.

తాను థియేటర్‌కు వెళ్లిన కారణంగానే తొకిసలాట జరిగిందని మృతురాలి భర్త ఫిర్యాదులో పేరొనడం సరికాదని అన్నాడు. ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు నమోదు చేసిన అభియోగాలేవీ తనకు వర్తించవని తెలిపారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని, విచారణ ప్రక్రియను నిలిపివేయాలని, ఈలోగా తనను అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నాడు అల్లు అర్జున్‌.

మరోవంక, అల్లు అర్జున్‌ క్వాష్‌ పిటిషన్‌పై విచారణ కోసం ఆయన న్యాయవాది ప్రయత్నాలు చేస్తున్నారు. అత్యవసర పిటిషన్‌గా విచారించాలని తెలంగాణ హైకోర్టును అల్లు అర్జున్‌ న్యాయవాది కోరారు. బుధవారం పిటిషన్‌ వేశామని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అత్యవసర పిటిషన్‌ను ఉదయం 10.30కే మెన్షన్ చేయాలి కదా? అని కోర్టు ప్రశ్నించింది. క్వాష్ పిటిషన్‌పై పోలీసుల దృష్టికీ తెచ్చామని అల్లు అర్జున్ లాయర్‌ నిరంజన్‌రెడ్డి తెలిపారు.

దీంతో పిటిషన్‌ను సోమవారం విచారిస్తామని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. పరిస్థితుల దృష్ట్యా లంచ్ మోషన్ పిటిషన్‌గా స్వీకరించాలని కోరారు. మ.1.30 గం.కు లంచ్ మోషన్ పిటిషన్ విచారణ కోరడం సరికాదని పీపీ అభిప్రాయపడ్డారు. సోమవారం వరకు చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలని పిటిషనర్‌ కోరారు. పోలీసుల నుంచి వివరాలు సేకరించాక కోర్టుకు సమాచారం ఇస్తామని ప్రబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు.