అనంత‌పురం మీదుగా విజ‌య‌వాడ‌- బెంగ‌ళూరు మ‌ధ్య వందే భారత్

అనంత‌పురం మీదుగా విజ‌య‌వాడ‌- బెంగ‌ళూరు మ‌ధ్య వందే భారత్
అనంత‌పురం మీదుగా ఇప్పటికే కాచిగూడ‌- య‌శ్వంత్‌పూర్‌, క‌ల్బ‌ర్గి- బెంగ‌ళూరు మ‌ధ్య వందేభార‌త్ రైళ్లు రాక‌పోక‌లు సాగిస్తున్నాయి. ఇప్పుడు విజ‌య‌వాడ‌- బెంగ‌ళూరు మ‌ధ్య వందే భార‌త్ రైలు వ‌స్తే, అది అనంత‌పురం మీదుగా రాక‌పోక‌లు నిర్వ‌హించే మూడో వందేభార‌త్ రైలు కానుంది.
 
దీంతో రాయ‌ల‌సీమలో ఉమ్మ‌డి క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల‌తో పాటు ఉమ్మ‌డి గుంటూరు జిల్లా ప్ర‌జ‌ల ప్ర‌యాణాల‌కు ప్రయాణం సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది.
కొత్తగా ప్రవేశపెట్టనున్న ఈ రైలు విజ‌య‌వాడ నుంచి గుంటూరు, ప‌ల్నాడు మీదుగా నంద్యాల‌, డోన్‌, గుంత‌క‌ల్లు, అనంత‌పురం, హిందూపురం, యల‌హంక‌లో స్టాప్‌లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. 
 
అయితే సాంకేతిక అంశాలు పూర్తి అయిన త‌రువాత ఈ రైలును ప్రారంభించ‌నున్నారు. ప్ర‌స్తుతం గుంటూరు నుంచి బెంగ‌ళూరుకు సుమారు 16 గంట‌ల స‌మ‌యం ప‌డుతోంది. ఈ సుధీర్ఘ ప్ర‌యాణ సమ‌యంతో వివిధ వ‌ర్గాల ప్ర‌జలు తీవ్ర అసౌక‌ర్యానికి గుర‌వుతున్నారు.  వందేభార‌త్ అందుబాటులోకి వ‌స్తే, ప్ర‌యాణ స‌మ‌యం చాలా వ‌ర‌కు త‌గ్గుతుంది. ఇప్ప‌టికే కేంద్ర రైల్వే శాఖ మంత్రికి విజ‌య‌వాడ‌- బెంగ‌ళూరు మ‌ధ్య వందేభార‌త్ రైలు తీసుకురావాల‌ని ప్ర‌జా ప్ర‌తినిధులు కూడా విజ్ఞ‌ప్తులు అంద‌జేశారు.
 
 ఇలా ఉండగా, దక్షిణ మధ్య రైల్వే వివిధ రైళ్ల‌కు 2,000 జ‌న‌ర‌ల్ కోచ్‌లు అందుబాటులో తీసుకురానుంది. ఇందులో ఫేజ్‌-1 కింద గుంటూరు- సికింద్రాబాద్ (12706), సికింద్రాబాద్‌-గుంటూరు (12705) రైళ్ల‌కు ఒక్కో జ‌న‌ర‌ల్ బోగీ జ‌త చేస్తారు. సికింద్రాబాద్‌-సిర్పూర్ ఖగజ్‌నగ‌ర్ (12757), సిర్పూర్ ఖగ‌జ్‌న‌గ‌ర్- సికింద్ర‌బాద్ (12758) రైళ్ల‌కు ఒక్కో జ‌న‌ర‌ల బోగీ జ‌త చేస్తారు. సికింద్రాబాద్-ద‌న‌పూర్ (12791), ద‌న‌పూర్‌-సికింద్రాబాద్ (12792) రైళ్ల‌కు నాలుగు జ‌న‌ర‌ల్ బోగీలు జ‌త చేస్తారు. ఫేజ్-2 కింద సికింద్రాబాద్-హౌరా (12704), హౌరా-సికింద్రాబాద్ (12705), సికింద్రాబాద్-గూడురు (12710), గూడురు- సికింద్రాబాద్ (12709), తిరుప‌తి-సికింద్రాబాద్ (12797), సికింద్రాబాద్‌-తిరుప‌తి (12798) రైళ్ల‌ కు అద‌న‌పు కోచ్‌లు జ‌త చేయ‌నున్నారు.