సోషల్ మీడియా పోస్టులపై మంత్రివర్గ ఉపసంఘం

సోషల్ మీడియా పోస్టులపై మంత్రివర్గ ఉపసంఘం
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ ఉపసంఘంను వేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, హోంమంత్రి అనితలతో ఉపసంఘం నియమిస్తూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. 
 
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెరిగిపోయాయని, ఇంట్లో ఉన్న ఆడవారిని సైతం వదలకుండా పోస్టులు పెడుతున్నారని జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం దృష్టికి మంత్రి నాదెండ్ల తీసుకెళ్లారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదని నాదెండ్ల చెప్పారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవరించాలని, మనం తీసుకునే చర్యలు దేశానికే ఆదర్శం కావాలని చంద్రబాబుని కోరారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ “నేరస్థులు రాజకీయ నాయకుల ముసుగులో బెదిరింపులకు దిగుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న పరిస్థితి ఏపీలో ఉంది. బ్రహ్మకుమారీస్ లాంటి సంస్థలపైనా అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. సామాజిక మాధ్యమాల నియంత్రణకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నాను” అని ప్రకటించారు. 

 
“సైబర్ సెక్యూరిటీ విభాగం చాలా పటిష్టంగా ఉండాలి. సైబర్ మోసాలు, టెక్నాలజీపై అవగాహన ఉన్న వారికి దీన్ని అప్పగించాలి. నేరస్థులు రాజకీయం ముసుగులో ఉంటూ థ్రెట్‌గా మారారు. సైబర్ క్రిమినల్స్‌కు అడ్డుకట్ట వేయాలంటే పోలీసులూ కొత్త పరిజ్ఞానం ఉపయోగించాలి. కొన్ని కేసుల దర్యాప్తు విషయాలను బహిర్గతం చేయడం ద్వారా ప్రజల్లోనూ అవగాహన పెంచాలి” అని సూచించారు. 
 
కొత్త తరహా నేరాలను ప్రత్యేకంగానే డీల్ చేయాల్సిన అవసరం ఉందని చెబుతూ  సంప్రదాయ నేరాలతోపాటు డిజిటల్ నేరాలను దర్యాప్తు చేసేందుకు బృందాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. పోలీసుల్లోనే సాంకేతిక నిపుణులు ఉండాలని, లేదంటే బయట నుంచి నిపుణుల్ని తీసుకువచ్చి కేసులు పరిష్కరించాలని తెలిపారు.

ప్రస్తుతం ఉన్నవాటి కంటే అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. సీసీ కెమెరాల ద్వారా రియల్ టైమ్ నేరాలు, ప్రమాదాల నియంత్రణ జరుగుతుందని పేర్కొంటూ సీసీ కెమెరాల ద్వారా వచ్చే డేటాను రియల్ టైమ్‌లో వినియోగించుకోవాలని చెప్పారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలను పెట్టి నేరస్థుల్ని గుర్తించాలని తెలిపారు. 

 
డ్రోన్ల ద్వారా ర్యాండమ్‌గా తనిఖీలు నిర్వహించాలని చెబుతూ రహదారులపై కొన్ని హాట్ స్పాట్‌లలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటినీ విశ్లేషించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకునేలా ఆ డేటా ఉపయోగించాలని చెప్పారు. సీసీ టీవీ కెమెరాలు అన్ని ప్రదేశాల్లో ఉన్నాయా లేదా చూడాలని, టెంపుల్, విగ్రహలు వద్దా కెమెరాలు పెట్టాలని, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ డేటా ఆన్ లైన్‌లో పెట్టాలని ఆదేశించారు.