‘ఏపీ ఏకైక రాజధాని అమరావతే. ఈ అంశాన్ని కూలంకషంగా పరిశీలించి దాన్నే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని దృఢ నిశ్చయానికి వచ్చాం. ఈ నేపథ్యంలో మాస్టర్‌ప్లాన్, భూసమీకరణ కింద రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు చట్టపరంగా నెరవేర్చాల్సిన హామీని అనుసరించి అమరావతిని అభివృద్ధి చేయాలని నిర్ణయించాం’ అని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
రాజధాని నిర్మాణం, అమరావతి ప్రాంత అభివృద్ధి, భూములు ఇచ్చిన రైతులకు రిటర్న్‌బుల్ ప్లాట్లను అన్ని రకాల మౌలిక వసతులతో మూడు సంవత్సరాలల్లో పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. రాష్ట్ర రాజధాని విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పాటు, సుప్రీంకోర్టు జారీ చేసే ఆదేశాలకు కట్టుబడి ఉంటామని వెల్లడించింది.
అందువల్ల న్యాయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం న్యాయస్థానం ముందు ఉన్న ఎస్‌ఎల్‌పీపై విచారణ ముగించాలని ప్రభుత్వం కోరింది. రాజధాని అంశానికి సంబంధించిన కేసుల విచారణ గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పేరుతో ఏపీ ప్రభుత్వం 16 పేజీల అఫిడవిట్‌ను సుప్రీంకోర్టుకు సమర్పించింది.
ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. మాస్టర్ ప్లాన్, భూసమీకరణ కింద రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు చట్టపరంగా నెరవేర్చాల్సిన హామీని అనుసరించి రాజధానిని అభివృద్ధి చేయాలని నిర్ణయించామని వెల్లడించింది. ఈ మేరకు బుధవారం అఫిడవిట్ దాఖలు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం 2014లో ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ చట్టాన్ని చేసి ఏపీసీఆర్‌డీఏని ఏర్పాటు చేసింది. గవర్నర్ ఆమోదముద్రతో ఆ చట్టాన్ని 2014 డిసెంబర్ 30న గెజిట్‌లో ప్రచురించింది. గుంటూరు, విజయవాడ మధ్య కృష్ణా నది పొడవునా 24 రెవెన్యూ గ్రామాల వ్యాప్తంగా 53,748 ఎకరాల విస్తీర్ణాన్ని రాజధాని నగర ప్రాంతంగా గుర్తించి 2014 డిసెంబర్ 30న జీఓ ఎంఎస్ నం.254ను విడుదల చేసిందని అందులో వివరించింది.
చట్టంలోని సెక్షన్ 3(3)ప్రకారం మొత్తం 122 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని రాజధాని ప్రాంతంగా ప్రకటించింది. ఆ తర్వాత 2015 జూన్ 9న విడుదల చేసిన జీఓ ఎంఎస్ నెం.141లో రాజధాని ప్రాంతాన్ని 122 చ.కి.మీ.కి బదులుగా 217 చ.కి.మీలుగా సవరించింది. పూర్తి స్థాయి మాస్టర్ ప్లాన్‌ను చట్టంలోని సెక్షన్ 39 ప్రకారం 2016 ఫిబ్రవరి 23న ప్రచురించింది. ఆ మాస్టర్ ప్లాన్‌లో ఏపీ ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చిందని తెలిపింది.
More Stories
కె వి రావుకు సి పోర్టు షేర్లు తిరిగి ఇచ్చేసిన అరబిందో!
అయోధ్య రామయ్యకు టిటిడి పట్టువస్త్రాలు
గిరిజనులు వ్యాపార రంగంలోకి రావాలి