టిఎంసి సభ్యుడి క్షమాపణ తిరస్కరించిన మంత్రి సింధియా

టిఎంసి సభ్యుడి క్షమాపణ తిరస్కరించిన మంత్రి సింధియా

  కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) సభ్యుడు కల్యాణ్ బెనర్జీ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు లోక్‌సభలో అలజడి రేపాయి. కల్యాణ్ బెనర్జీ క్షమాపణ చెప్పినప్పటికీ రభస సద్దుమణగకపోవడంతో సభను పదే పదే వాయిదాల అనంతరం తుదకు సభాధ్యక్షుడు గురువారానికి వాయిదా వేశారు. 

విపత్తు నిర్వహణ చట్టానికి సవరణలపై చర్చ సమయంలో బెనర్జీ మాట్లాడుతున్నప్పుడు గందరగోళం నెలకొంది. కరోనా మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని టిఎంసి సభ్యుడు ఆరోపించారు. కానీ హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఆయన ఆరోపణను తోసిపుచ్చారు. అన్ని రాష్ట్రాలకు సాయం చేసింది, ప్రతి ఒక్కరినీ కలుపుకుంటూ సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది ప్రధాని నరేంద్ర మోదీయేనని రాయ్ చెప్పారు.

తమ భూభాగం ద్వారా కరోనా వ్యాక్సిన్ల రవాణాలో అంతరాయం కలిగించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నించిందని కూడా రాయ్ ఆరోపించారు. సింధియా లేచి, రాయ్‌ను సమర్థించారు. మహమ్మారి సమయంలో భారత్ ‘విశ్వ బంధు’గా ఆవిర్భవించిందని, ప్రపంచవ్యాప్తంగా ఆపన్న దేశాలు అన్నిటికీ సాయం చేసిందని సింధియా తెలియజేశారు.

దీనితో సింధియాని బెనర్జీ తప్పు పట్టుతూ, ఆయనపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన వాఖ్యాలను స్పీకర్ ఓమ్ బిర్లా రికార్డుల నుండి తొలగించారు. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు సాగడం సభ వాయిదాకు దారి తీసింది. సభ తిరిగి సమావేశమైనప్పుడు బెనర్జీ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. కానీ వాటిని అంగీకరించేందుకు సింధియా నిరాకరించారు.

‘కల్యాణ్ బెనర్జీ ఈ సభలో లేచి విచారం వెలిబుచ్చారు. అయితే, దేశం అభివృద్ధి కోసం సేవ స్ఫూర్తితో మనం అంతా ఈ సభకు వస్తుంటాం. మనం ఆత్మ గౌరవ భావంతో కూడా వస్తుంటాం. తమ జీవితాల్లో ఏ వ్యక్తి అయినా తమ ఆత్మ గౌరవంతా రాజీ పడరు. మా విధానాలపై, మా అభిప్రాయాలపై విమర్శలు చేయండి. కానీ మీరు వ్యక్తిగత స్థాయికి వెళితే, తత్ స్పందకు కచ్చితంగా సిద్ధపడాలి’ అని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘ఆయన క్షమాపణ చెప్పారు.  కానీ, నాపైన, భారత మహిళలపైన ఆయన చేసిన వ్యక్తిగత దాడికి ఆయన క్షమాపణను నేను అంగీకరించడం లేదు’ అని సింధియా స్పష్టం చేశారు. బెనర్జీ మళ్లీ క్షమాపణ చెప్పారు. కానీ అధికార పక్ష సభ్యుల నుంచి నిరసనలు కొనసాగాయి. సభకు అధ్యక్షత వహించిన ఎ రాజా మాట్లాడుతూ ఇద్దరూ తమ మధ్య సమస్యను పరిష్కరించుకున్నారని చెప్పారు.

అయితే గందరగోళం కొనసాగడంతో సభను సాయంత్రం 5 గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైనప్పుడు, సమాజ్ వాదీ పార్టీ సభ్యుడు బిల్లుపై మాట్లాడటం ప్రారంభించారు. అయితే ట్రెజరీ బెంచ్‌ల ద్వారా పెద్దఎత్తున నిరసనలు కొనసాగడంతో చైర్ సభను గురువారానికి సభను వాయిదా వేశారు.