పార్లమెంట్ ఉభయ సభలు గందరగోళ దృశ్యాల నడుమ బుధవారం వాయిదా పడ్డాయి. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై టిఎంసి సభ్యుడు కల్యాణ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలు అలజడి సృష్టించగా పదే పదే వాయిదాల అనంతరం లోక్‌సభ గురువారానికి వాయిదా పడింది. రాజ్యసభ ఎటువంటి కార్యకలాపాలూ నిర్వహించకుండానే బుధవారం మధ్యాహ్నం గురువారానికి వాయిదా పడింది.
సభ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నోటీస్‌పైన, జార్జి సోరోస్ వివాదంపైన అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదంతో గందరగోళ పరిస్థితులు నెలకొనగా సభను వాయిదా వేయవలసి వచ్చింది. బుధవారం మొదటిసారి వాయిదా అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు రాజ్యసభ తిరిగి సమావేశమైన వెంటనే సభా నాయకుడు జెపి నడ్డా మాట్లాడుతూ, దేశాన్ని అస్థిరపరిచేందుకు బిలియనీర్ మదుపరి జార్జి సోరోస్‌తో కాంగ్రెస్ కుమ్మక్కయిందని ఆరోపించారు.
ఉన రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చిందుకు కూడా కాంగ్రెస్‌ను ఆయన ఆక్షేపించారు. ‘కాంగ్రెస్ అధిష్ఠానం, సోరోస్ మధ్య సంబంధాల’ అంశంపై నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రతిపక్షం చేసిన ప్రయత్నం అది అని ఆయన ఆరోపించారు. సభ సమావేశమైన తరువాత, సభా నాయకుడు మాట్లాడేందుకు డిప్యూటీ చైర్మన్ అనుమతించిన వెంటనే అధికార పక్ష సభ్యులు లేచి ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు.
‘జార్జి సోరోస్‌తో కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి గల సంబంధాల అంశాన్ని మా సభ్యులు గత రెండు రోజులుగా లేవదీస్తున్న విషయం మీ దృష్టికి తీసుకువస్తున్నా. సోరోస్‌కు, సోనియా గాంధీకి మధ్య ఎటువంటి సంబంధం ఉంది?’ అని నడ్డా ప్రశ్నించారు. ఇది దేశ సార్వభౌమత్వానికి, అంతర్గత, బాహ్య భద్రతకు సంబంధించిన అంశం అని ఆయన చెప్పారు. ప్రధాన ప్రతిపక్షం, జార్జి సోరోస్ మధ్య సంబంధంపై చర్చ జరగాలని నడ్డా కోరారు.
‘మావాళ్లు కోపంగా ఉన్నారు, దీనిపై చర్చ కోరుతున్నారు’ అని ఆయన చెప్పారు. చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానం నోటీస్ అంశాన్ని నడ్డా ప్రస్తావిస్తూ, సభాధ్యక్షునిపై ఆరోపణలు చేయడం ద్వారా అసలు సమస్య నుంచి వారు దృష్టి మళ్లించజూస్తున్నారని విమర్శించారు.
‘దేశ సార్వభౌమత్వం, అంతర్గత, బాహ్య భద్రతకు ముప్పు నుంచి దేశం దృష్టి మళ్లించేందుకు ఇది ఒక వ్యూహం, కాంగ్రెస్ దీనికి దోహదం చేసింది. (విదేశీ శక్తులకు)మద్దతు ఇవ్వడంలో వారికి ఒక సాధనంగా ఆ పార్టీవారు మారుతున్నారు, దీనిపై చర్చ జరగాలి’ అని నడ్డా స్పష్టం చేశారు. ‘చైర్మన్‌పై కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్న తీరు గర్హనీయమని కూడా స్పష్టం చేయదలిచాను. దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలి’ అని సభా నాయకుడు పేర్కొన్నారు.
‘వారు సభలో గాని, వెలుపల గాని చైర్మన్‌ను ఎన్నడూ గౌరవించలేదు. చైర్మన్ నిర్ణయంపైన, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిపైన వారు వ్యాఖ్యలు చేసిన తీరు గర్హనీయం’ అని నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యులు పదే పదే అలజడి సృష్టిస్తుండడంతో సమస్త దేశం ఆగ్రహంతో ఉన్నదని, వారిని ఎన్నటికీ క్షమించబోదని నడ్డా హెచ్చరించారు.

More Stories
హర్మూజ్‌లో నౌకాయాన స్వేచ్ఛ కీలకం.. ఇరాన్ అధ్యక్షునితో మోదీ
భారత్ ను ఆశ్రయిస్తాం…. పాక్ కు పీఓకే ప్రజల హెచ్చరికలు
అమర్నాథ్ యాత్రకు ఉగ్రముప్పు.. కేంద్రం అప్రమత్తం