బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న బాలికను ప్రార్థనల పేరుతో బలిగొన్న సంఘటన నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదురుపల్లిలో చోటుచేసుకుంది. బాధిత బంధువులు, స్థానికుల వివరాల ప్రకారం కలువాయి మండలం బాలాజీరావుపేటకు చెందిన పామర్తి లక్ష్మయ్య, లక్ష్మి దంపతుల కుమార్తె భవ్యశ్రీ (8). చిన్నారికి 2 నెలల క్రితం ఆరోగ్యం బాలేక నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
స్కానింగ్ తీయించగా బ్రెయిన్ ట్యూమర్ అని వైద్యులు గుర్తించి చెన్త్నెకి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో తల్లిదండ్రులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కుగానీ, చెన్నైకిగానీ తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.
ఇదిలా ఉండగా ఓ రోజు చర్చికి వెళ్లి ప్రార్థన చేద్దామని వారు చేజర్ల మండలంలోని ఆదురుపల్లికి వెళ్లారు. ప్రార్థనలకు తగ్గకపోతే ఆస్పత్రికి తీసుకెళ్లాలని చర్చి పాస్టర్ వారికి సూచించారు. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులు సమ్మతించి వేచి చూశారు. వారం రోజుల తరువాత బాలిక కొంత హుషారుగా కనిపించడంతో చర్చిలోనే ఉంచారు.
చిన్నారితో ఒకరోజు అన్నదానం కూడా చేయించారు. ఆ తరువాత 40 రోజులకు బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించి సోమవారం రాత్రి చనిపోయింది. దీంతో లక్ష్మయ్య, లక్ష్మీ దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. వీరికి భవ్యశ్రీతో పాటు మరో కుమార్తె, ఒక కుమారుడు సంతానం ఉన్నారు.
బాలికకు సరైన చికిత్స అందకుండా ఆమె తల్లిదండ్రులను మత బోధకుడు మభ్యపెట్టారని బంధువులు ఆరోపించారు. ఆదూరుపల్లిలోని ప్రార్థనా మందిరం వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. తమ బిడ్డకు బ్రెయిన్ ట్యూమర్ ఉందనీ, దేవుడిపై ఆశతో చర్చిలో ఉంచామని మృతురాలి తల్లిదండ్రులు చేజర్ల పోలీసులకు వివరించారు.
బాలిక మృతదేహాన్ని కలువాయి మండలం బాలాజీరావుపేటకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. బాలిక చనిపోవటానికి తాను కారణం కాదనీ, పెద్ద ఆస్సత్రుల్లో చికిత్స చేయించే ఆర్థిక స్థోమత లేదంటే చర్చిలో ఉండి దేవుని నమ్ముకోమని సూచించినట్లు మత బోధకుడు వివరించారు.
More Stories
నకిలీ దర్శనం టికెట్లు అమ్ముతున్న ఐదుగురు అరెస్ట్
కుంభమేళాలో ఆకట్టుకుంటున్న శ్రీవారి నమూనా ఆలయం
తిరుమల శ్రీవారి పరకామణి బంగారం చోరీకి యత్నం