ఏపీ మంత్రివర్గంలోకి నాగబాబు

ఏపీ మంత్రివర్గంలోకి నాగబాబు
ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి దక్కింది. ఆయనకు కేబినెట్‌లో చోటు దక్కనున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాజ్యసభ ఉపఎన్నికలలో కూటమి తరపున పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తూ ఈ ప్రకటన చేశారు. 
 
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తారు. ఇటీవల ఎన్నికల్లో నాగబాబు ఎంపీగా పోటీ చేయాలని భావించినా పొత్తుల్లో పోటీ సాధ్యపడలేదు. దీంతో ఆయనను రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరిగింది. ఏపీలో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అవ్వగాజనసేన నుంచి నాగబాబు పేరు వినిపించింది. 
 
అయితే నాగబాబు రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధంగా లేకపోవడంతో ఆయనకు మంత్రి పదవి కేటాయించినట్లు సమాచారం. త్వరలో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి, మంత్రి పదవి కేటాయించనున్నారు. ఏపీలో అసెంబ్లీ స్థానాలను అనుసరించి 25 మందిని మంత్రులుగా నియమించవచ్చు. 
 
ప్రస్తుత కేబినెట్ లో 24 మంది మంత్రులు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిన జనసేన మూడు మంత్రి పదవులు తీసుకుంది. ఆ పార్టీ నుంచి పవన్‌ కల్యాణ్‌, కందుల దుర్గేశ్‌, నాదెండ్ల మనోహర్‌ మంత్రులుగా ఉన్నారు.  పొత్తుల్లో భాగంగా జనసేనకు 4, బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయించారు. మిగిలిన ఒక్క మంత్రి పదవిని తాజాగా జనసేన నుంచి ఖరారు చేశారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నాగబాబును కేబినెట్ లోకి తీసుకున్నారు
 
ఏపీలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు గానూ బిజెపి నుంచి ఒకరిని, టీడీపీ నుంచి ఇద్దర్ని ఎంపిక చేయాలని కూటమి పార్టీలు నిర్ణయించాయి. బీజేపీ తమ రాజ్యసభ అభ్యర్థిగా ఆర్‌. కృష్ణయ్య పేరును ఖరారు చేసిది. టీడీపీ బీద మస్తాన్‌రావు, సానా సతీష్ పేర్లు ఖరారు చేసింది.