పవన్ కల్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్

పవన్ కల్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్
ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ను చంపేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్‌ కాల్స్‌, అభ్యంతరకర భాషతో మెసేజ్ వచ్చాయని అధికారులు తెలిపారు. ఫోన్ చేసిన అజ్ఞాత వ్యక్తి.. చంపేస్తామని హెచ్చరించినట్లు తెలిసింది. అలాగే అభ్యంతకర భాషను ఉపయోగిస్తూ సందేశాలు పంపినట్లు సమాచారం.
 
ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీ ఉంది. సోమవారం పవన్ కళ్యాణ్ లేని సమయంలో పేషీకి ఆయన్ను చంపేస్తామంటూ ఆగంతకుల నుంచి బెదిరింపు కాల్స్ తో పాటు మెసేజ్ లు కూడా వచ్చాయి. ఇందులో పవన్ ను అసభ్య భాషలో జారీ చేసిన హెచ్చరికలు కూడా ఉన్నాయి. దీంతో పేషీ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.
విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సూచన మేరకు పేషీ సిబ్బంది పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్‌ రావడంపై హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత డీజీపీ ద్వారక తిరుమలరావుతో మాట్లాడారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పవన్ కల్యాణ్ పేషీకి రెండుసార్లు బెదిరింపు కాల్స్‌ వచ్చాయని డీజీపీ హోంమంత్రికి తెలిపారు.
పవన్ కల్యాణ్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్‌పై హోంమంత్రి వంగలపూడి అనిత ఆరా తీశారు. ఫోన్ కాల్స్, మెసేజ్ ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్యల వెనక ఎవరు ఉన్నా వదిలిపెట్టేది లేదని ఆమె స్పష్టం చేశారు. 
 
హోంమంత్రి ఆదేశాలతో బెదిరింపు కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఇటీవల రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపారు. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్నారు. ఓ భారీ షిప్ లో తరలిస్తున్న రే,న్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ ఘటనల అనంతరం పవన్ కు బెదిరింపు కాల్స్ రావడంతో పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు చేసే అవకాశం ఉంది.