సోషల్ మీడియా పాత్రపై విద్యా భారతి సమాలోచనలు

సోషల్ మీడియా పాత్రపై విద్యా భారతి సమాలోచనలు

విద్యా భారతి అఖిల భారతీయ శిక్షా సం‌స్థాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ శారదా ధామం లో అఖిల భారతీయ సమావేశాలు జరిగాయి. ప్రచార విభాగం, అభిలేఖాగార్ (డాక్యుమెంటేషన్ ) విభాగాల నుంచి దాదాపుగా దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు విచ్చేశారు. గత ఏడాది కాలంలో నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. 
 
సంఘటన పరంగా పటిష్టం చేసేందుకు మార్గాలను చర్చించారు‌. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా పోషిస్తున్న పాత్ర మీద సమాలోచనలు జరిపారు. ప్రారంభ కార్యక్రమం లో క్షేత్ర అధ్యక్షులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ చామర్తి ఉమామహేశ్వరరావు, కార్యదర్శి ఆయాచితుల లక్ష్మణరావు అతిథులుగా విచ్చేశారు. ఎనిమిది అంచెలుగా సమీక్షలు చేపట్టారు. 
 
అఖిల భారతీయ మహా మంత్రి లలిత్ గోస్వామి, అఖిల భారతీయ సంఘటన మంత్రి గోవింద్ మహాపాత్రో, అఖిల భారతీయ ప్రచార ప్రభారీ లింగం సుధాకర్ రెడ్డి పర్యవేక్షించారు. కుటుంబ ప్రబోధన, పర్యావరణం,  సామాజిక సమరసత, నాగరిక కర్తవ్య బోధ,  స్వ బోధ అనే ఐదు రకముల పంచ పరివర్తన మీద ప్రత్యేకంగా చర్చించారు. విద్యాలయం కేంద్రం గా చేపట్టాల్సిన సామాజిక అంశాల మీద దృష్టి పెట్టారు.

ఆయా రాష్ట్రములు, క్షేత్రములకు సంబంధించిన ప్రగతి నివేదికలను కన్వీనర్ లు సమర్పించారు. ఆయా పత్రముల ఆధారంగా కార్యాచరణ రూపొందించారు. దేశవ్యాప్తంగా రాబోయే సంవత్సరం కోసం భవిష్యత్తు లక్ష్యాలు ఏర్పాటు చేసుకొన్నారు. ప్రత్యేక ప్రాజెక్టు లు అయిన ప్రకల్పములకు నిర్దిష్ట వ్యవస్థ ఉండాలని నిర్దేశించుకున్నారు. 

 
విద్యార్థులు, యువత లో భారతీయ దృష్టి కోణం నెలకొల్పేందుకు చొరవ చూపాలని నిర్ణయించారు. ఇందుకోసం సాంప్రదాయ విధానాలతో పాటు అధునాతన మార్గాలను ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. ముగింపు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ తిరుపతి రావు, కార్యదర్శి ముక్కాల సీతారాములు విచ్చేశారు. కార్యక్రమ వ్యవస్థ ను తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రి పతకమూరి శ్రీనివాస్ రావు సమన్వయం చేశారు.