తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించి, నోరు పారేసుకున్న సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్, సీఐ శ్రీనివాసాచారి తమకు క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. పోలీసులు తమకు క్షమాపణలు చెప్పకపోతే పరిస్థితి వేరేలా ఉంటదని ఆశా వర్కర్లు హెచ్చరించారు. వేతనాలు పెంచాలని కోఠిలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన ఆశా వర్కర్లపై పోలీసులు క్రూరంగా వ్యవహరించారు.
మహిళా పోలీస్ సిబ్బంది ఉన్నప్పటికీ, ఆశా కార్యకర్తలపై మగ పోలీసులు దమనకాండ సాగించారు. చీరపట్టి లాగుతూ, ఎడాపెడా కొడుతూ, కిందపడేసి లాగుతూ బీభత్సం సృష్టించారు. ఇన్‌స్పెక్టర్‌పై ఒక మహిళ చేయిచేసుకున్నదని ఆరోపిస్తూ మరింత రెచ్చిపోయారు. అయితే, ఆ ఇన్‌స్పెక్టరే తనపై ఎలాంటి దాడి జరగలేదని చెప్తున్నా వినకుండా మగ పోలీసులు, మహిళా పోలీసులు కలిసి డీసీఎంలో ఉన్న ఆశా వర్కర్లను ఎగిరెగిరి కొడుతూ దాష్టీకాన్ని ప్రదర్శించారు.
ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే మరోవైపు పోలీసులు మహిళలపై సాగించిన దౌర్జన్యకాండను చూసి రాష్ట్ర ప్రజలు నివ్వెరపోయారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తమకు రూ. 18 వేలు ఫిక్స్‌డ్ జీతాలు ఇవ్వాలని కోఠిలోని డీఎంఈ కార్యాలయం వద్ద తాము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే, పోలీసులు దాడులకు పాల్పడ్డారని ఆశా వర్కర్లు వాపోయారు. సొమ్మసిల్లి పడిపోయిన ఇద్దరు ఆశా వర్కర్లు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.
ఆశా వర్కర్ స్పృహ తప్పి పడిపోయింది అని చెప్పినా వినకుండా పోలీసులు లాగి పడేశారని కన్నీరు పెట్టుకున్నారు. ఆశా వర్కర్ కళ్లు తిరిగి పడిపోయినా కూడా పోలీస్ వాళ్లు పట్టించుకోకుండా, దౌర్జన్యంగా వ్యానులో ఎత్తేశారని పేర్కొన్నారు. ఆశా వర్కర్ సృహా తప్పిపోయిందని చెప్పినా కూడా పట్టించుకోకుండా, గంట సేపు ఆసుపత్రికి తీసుకెళ్ళకుండా సిటీలో తిప్పారు.
ఇంకో ఆశా వర్కర్ కూడా తనకు ఒంట్లో బాలేదని చెప్పినా కూడా పోలీసులు మాట వినలేదు. వ్యానులో కుక్కల్లా తిప్పారు కానీ ప్రాణాపాయ స్థితిలో ఉన్నా పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్ళలేదు. మా ఆశా వర్కర్‌కు ఏమైనా అయితే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. ఎస్ఐ శ్రీనివాస్ చారి మా ఆశా వర్కర్‌ను బూతు పదంతో తిట్టాడు.
మహిళల పట్ల పోలీసులు ప్రవర్తించే తీరు ఇదేనా? అని ఆశా వర్కర్లు నిలదీశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామని ఆశా వర్కర్లు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆశా వర్కర్లు దుమ్మెత్తి పోశారు. మమ్మల్ని ఎంత ఇబ్బందులకు గురి చేశాడో అంతకంత అనుభవిస్తాడంటూ ఆశ వర్కర్లు హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోఠి డీఎంఈ కార్యాలయం వద్ద ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనకు దిగిన ఆశా వర్కర్లపై పోలీసుల దాడిని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్వీ సుభాష్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరిస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అదే రోజున మహిళలపై దౌర్జన్యానికి ఒడిగట్టడం దుర్మార్గం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదేనా ఇందిరమ్మ రాజ్యమంటే? మహిళలను అవమానించడం, దాడులను ప్రోత్సహించడమేనా ప్రజాపాలన? అని ప్రశ్నించారు. మహిళలను అవమానించడమే సోనియయ్మకు ఇచ్చే కానుకనా? అని నిలదీశారు.
More Stories
మంత్రులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు
భార్యతో సెల్ఫీతోనే మావోయిస్టు చలపతి హతం!
పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు