
తిరుమలలోని వంటశాల ఆధునికీకరణతో పాటు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం అందించేందుకు కొత్త పరికరాల ఏర్పాటుకు టీటీడీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పరికరాల యాంత్రీకరణ (మెకనైజేషన్)తో పాటు వంటశాలలను పూర్తిగా మార్చేందుకు టీవీఎస్ మోటార్స్ (టీవీఎస్‌ఎం)తో ఒప్పందం చేసుకోనుంది. తొలివిడత పైలట్ ప్రాజెక్టుగా మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నదాన సత్రం లో పనులు చేపట్టనున్నారు.
వైఎస్సార్సీపీ హయాంలో అన్నప్రసాదాలపై భక్తుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. కూటమి అధికారంలోకి రాగానే దీనిపై ప్రత్యేకదృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పర్యటన సందర్భంగా వంటశాలను ఆటోమేట్ చేసే ప్రక్రియను చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఇందులో భాగంగా టీవీఎస్ ప్రతినిధులు అక్టోబరు 24, 25 తేదీల్లో తిరుమలలోని ఎంటీవీఏసీ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, నారాయణగిరి షెడ్స్, బాహ్యవలయ రహదారిలోని క్యూలైన్లు, కొత్తగా నిర్మించిన వకుళమాత కేంద్రీకృత వంటశాల, పద్మావతి అతిథిగృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంటీవీఏసీ ప్రత్యేక అధికారి అక్కడ ఉన్న పరికరాలు, అన్నప్రసాదం తయారీ విధానాన్ని టీవీఎస్ ప్రతినిధులకు వివరించారు.
టీటీడీతో ఎంవోయూ చేసుకునేందుకు టీవీఎస్‌ఎం ముందుకొచ్చింది. తిరుమల శ్రీవారి భక్తులకు అన్నప్రసాదాన్ని అందించేందుకు 2011లో ఎంటీవీఏసీని నిర్మించారు. అన్నప్రసాద వంటశాలను పూర్తిగా ఆధునికీకరించేందుకు అవసరమైన అన్ని ప్రతిపాదలను, డిజైన్లను టీవీఎస్‌ఎం అందించనుంది.
పరికరాలను సరఫరా చేసే గుత్తేదారులను గుర్తించి టీటీడీకి సమాచారం ఇవ్వనుంది. వంటశాలను పూర్తిగా మార్చే నైపుణ్యం ఉన్న కన్సల్టెంట్లను టీవీఎస్‌ఎం చూడనుంది. వీరికి నిధులను ఆ సంస్థే భరిస్తుంది. ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును ఇవ్వనుంది.అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకురావడం వల్ల భక్తులకు సకాలంలో నాణ్యమైన అన్నప్రసాదాన్ని అందించేందుకు ఆస్కారం ఉంది.
అన్నదానంలో నాణ్యతను పెంచేందుకు తిరుపతి తిరుమల దేవస్థానం అధికారులు తెలుగు రాష్ట్రాల రైస్‌మిల్లర్ల సంఘం నుంచి బియ్యన్ని సేకరిస్తోంది. గతంలో విరిగిన, దెబ్బతిన్న, బియ్యం 47.5% ఉన్నా అంగీకరించేవారు. ఇప్పుడు 26.5 శాతానికి తగ్గించారు. దీనివల్ల నాణ్యమైన బియ్యం రావడానికి అవకాశం ఏర్పడింది.
More Stories
వైసీపీ మాజీ ఎంపీ ఆస్తులను జప్తు చేసిన ఈడీ
ఫైళ్లను పట్టించుకోని చంద్రబాబు, ఆయన మంత్రులు
తిరుమలలో 18 మంది అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు