ఏపీలో రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై సిట్‌

ఏపీలో రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై సిట్‌
ఏపీలో రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై సిట్‌ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. సిట్‌ చైర్మన్‌గా సిఐడి ఐజి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నియమితులు కాగా మరో ఐదు మంది సభ్యలను నియమించింది. ఇందులో ఉమా మహేశ్వర్(సీఐడీ ఎస్పీ), అశోక్ వర్ధన్ (డీఎస్సీ), బాలసుందర రావు (డీఎస్సీ), గోవిందా రావు(డీఎస్సీ), రత్తయ్య(డీఎస్పీ) సభ్యులుగా ఉన్నారు.
 
ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బియ్యం అక్రమ రవాణా కేసులన్నీ విచారించనుంది. కాకినాడ జిల్లాలో నమోదైన 13 ఎఫ్ఐఆర్ లను కూడా విచారించనుంది. ఇవే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యే కేసులను కూడా విచారించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. విచారణకు సంబంధించిన నివేదికలను ప్రతి 15 రోజులకోసారి సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.
 
ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించడానికి సిట్‌ బృందానికి ప్రత్యేక అధికారాలను కల్పించింది. తనిఖీలు, జప్తులు, అరెస్టులు చేసేందుకు కూడా అవకాశం ఇచ్చింది. సిట్‌కు అవసరమైన సమాచారం ఇవ్వాలని డిజిపి, హోంసెక్రటరీకి సిఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ సూచించారు

ఈ మధ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టులో పర్యటించి రేషన్ బియ్యం అక్రమ రవాణాను గుట్టురట్టు చేశారు. భారీ షిప్ లో విదేశాలకు తరలిపోతున్న రేషన్ బియ్యంను రెడ్ హ్యాండడ్ గా పట్టుకున్నారు. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఆ తర్వాత ఈ విషయంపై కాకినాడ కలెక్టర్ షాన్‌మోహన్‌ స్పందించారు.

కాకినాడ పోర్టులోని స్టెల్లా షిప్‌ను సీజ్ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు ఈ అంశంపై విచారణకు ఐదు శాఖల అధికారులతో మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లై, పోర్ట్‌, కస్టమ్స్‌ అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణాలో అధికారుల వైఫల్యం ఉందని పేర్కొన్నారు. 

 
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తు చేస్తున్నామని ప్రకటించారు. గోడౌన్ల నుంచి షిప్ వరకు బియ్యం ఎలా తరలించారో దర్యాప్తులో తేలుస్తామని చెప్పారు. ఈ షిప్ లో బియ్యం ఎవరు ఎగుమతి చేస్తున్నారు, బియ్యం ఎక్కడున్నాయో పరిశీలిస్తామని వెల్లడించారు.

కాకినాడ పోర్టు నుంచి భారీగా రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతుంది. వీటి వెనుక బడా నేతలున్నారనే విమర్శలు లేకపోలేదు. గత వైసీపీ ప్రభుత్వంలో అధికార పార్టీ నేతలు బియ్యం అక్రమ రవాణాకు పాల్పడ్డారనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం అక్రమ రవాణాలో కూటమి నేతల హస్తం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

కాకినాడ పోర్టు వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పవన్ కల్యాణ్ చర్చించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రేషన్‌ బియ్యం మాఫియాపై మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు సైతం చర్చించారు. వేల కోట్ల విలువైన రేషన్ బియ్యం విదేశాలకు తరలించడాన్ని వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని మంత్రులు నిర్ణయించారు. 

 
అంతేకాకుండా ఇటీవలేన సీఎం చంద్రబాబు కూడా అధికారులకు రేషన్ బియ్యం రవాణకు అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సిట్ ఏర్పాటు చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయి.