
పలు సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూ పంజాబ్- హర్యానా నడుమగల శంభూ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు శంభూ సరిహద్దులకు చేరుకుని ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
దాంతో ఆందోళనకారులు పరుగులు తీశారు. పలువురు సొమ్మసిల్లి కిందపడిపోయారు. పోలీసులు, రైతుల ఉరుకులు, పరుగులతో ఆ ప్రాంతమంతా గందరగోళంగా మారింది. కాగా వ్యవసాయ సంస్కరణల ద్వారా తమకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని, పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు.
ఆందోళనలో భాగంగా వారు చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. అయితే రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు పెద్ద ఎత్తున భారీకేడ్లను ఏర్పాటు చేశారు. పంటలకు కనీస మద్దతు ధర సహా 12 డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ శంభు సరిహద్దు ఉన్న రైతులు ఢిల్లీ
మార్చ్‌ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ నోయిడా దగ్గర ఆందోళనలో పాల్గొంటున్న రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఢిల్లీ చలోకు రైతులు పిలుపునిచ్చిన నేపథ్యంలో హరియాణా సర్కార్ అలర్ట్ అయ్యింది. అంబాలా జిల్లాలోని 11 గ్రామాల్లో మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలను డిసెంబర్ 9 వరకు నిలిపివేసింది. అంతేకాకుండా 163 సెక్షన్‌ను అమలు చేశారు.
అయితే బ్యాంకింగ్, మొబైల్ రీచార్జ్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని పేర్కొన్నారు. ఈ మేరకు హర్యానా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఆ మేరకు టెలికామ్ ప్రొవైడర్లకు కూడా తగిన సూచనలు చేసింది. వ్యవసాయ సంస్కరణల ద్వారా తమకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని, పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ అంబాలా రైతులు ఆందోళన చేస్తున్నారు.
100 మంది రైతుల బృందం శాంతియుతంగా ఢిల్లీ వైపు కవాతు చేస్తుందని శంభు సరిహద్దు వద్ద ఉన్న రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న బారికేడ్లను బద్దలు కొట్టే ఉద్దేశం రైతులకు లేదని వెల్లడించారు. రైతులు ట్రాక్టర్లపై ఢిల్లీ వైపునకు వెళ్లడం వల్ల తమకు సమస్యగా ఉందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు చెప్పాయని తెలిపారు. అందుకే 100 మంది రైతుల బృందం శాంతియుతంగా ఢిల్లీ వైపు వెళుతుందని చెప్పారు.
పంటలకు కనీస మద్దతు ధరే తమ ప్రధాన డిమాండ్ అని రైతు నాయకురాలు సుఖ్వీందర్ కౌర్ వ్యాఖ్యానించారు. “మాకు 12 డిమాండ్లు ఉన్నాయి. అందులో ప్రధాన డిమాండ్ పంటలకు కనీస మద్దతు ధర. పంజాబ్ ప్రభుత్వం ఎంఎస్పీ అందిస్తుందని హామీ ఇచ్చింది. కానీ ఆ హామీ నెరవేర్చలేదు. పంజాబ్ సర్కార్‌తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. ” అని కౌర్ తెలిపారు.
ఇలా ఉండగా, వ్యవసాయ ఉత్పత్తులన్నింటినీ మోదీ సర్కార్ కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం రాజ్యసభలో తెలిపారు. వరి, గోధుమ, జొన్న, సోయాబీన్ పంటలను మూడేళ్ల క్రితం కంటే 50 శాతం ఎక్కువకు కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం ఇప్పటికే రైతులకు లాభసాటి ధరలను ఇస్తోందని వ్యాఖ్యానించారు. రైతు నిరసనల నేపథ్యంలో శివరాజ్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
More Stories
ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్ నుండి సనాతన- బౌద్ధ ఐక్యత సందేశం
భారత శ్రామిక శక్తికి కృత్రిమ మేధస్సుతో ముప్పు
చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా