నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ59 రాకెట్‌

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ59 రాకెట్‌

శ్రీహ‌రికోట‌లోని స‌తీష్ ధావ‌న్ అంత‌రిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ59 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్‌ ప్రోబా – 3 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది. కృత్రిమ సూర్య గ్రహణాన్ని సృష్టించడం ద్వారా భానుడి గుట్టు విప్పేందుకు ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ)కు చెందిన ప్రోబా-3 మిషన్‌ శాటిలైట్లను నింగిలోకి పంపింది. 

కాగా, ఈ ప్రయోగం నిన్ననే చేపట్టాల్సి ఉంది. అయితే, చివరి నిమిషంలో ప్రోబా3 స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపం త‌లెత్తడంతో ప్రయోగాన్ని ఇస్రో ఇవాళ్టికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) సహకారంతో ప్రోబా-3ని ప్రయోగించింది. ప్రోబా-3 మిషన్‌లో రెండు ఉపగ్రహాలు (కరోనాగ్రాఫ్‌ స్పేస్‌క్రాఫ్ట్‌, ఆక్యుల్టర్‌ స్పేస్‌క్రాఫ్ట్‌) ఉన్నాయి. 

దాదాపు 550 కిలోల బరువు ఉండే ఈ ఉపగ్రహాలను అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెడతారు. కృత్రిమ గ్రహణాన్ని సృష్టించడం ద్వారా సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాను అధ్యయనం చేయడమే ప్రోబా-3 లక్ష్యం. ఆ రెండు ఉపగ్రహాలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ క్రమపద్ధతిలో భూకక్ష్యలో విహరించ‌నున్నాయి

ప్రోబా-3 మిషన్‌లో ప్రయోగించిన ఉపగ్రహాలు కృత్రిమ సూర్యగ్రహణ పరిస్థితులను సృష్టిస్తాయి. తద్వారా సూర్యుడి బయటి పొర అంటే కరోనాను అధ్యయనం చేస్తాయి. ఈ జంట ఉపగ్రహాల్లో ఒక దాంట్లో కరోనాగ్రాఫ్ ఉంటుంది. మరొకటి ఆల్టరర్ కలిగి ఉంటుంది. ఈ ఉపగ్రహాలలో ఒకటి సూర్యుడిని కనిపించకుండా కృత్రిమ గ్రహణం పరిస్థితి సృష్టిస్తే మరొకటి కరోనాను నిశితంగా గమనిస్తూ వస్తుంది.

సాధారణంగా సూర్యుని ప్రచండ వెలుగుల మధ్య కరోనా పొరను గమనించడం చాలా కష్టం. ఎందుకంటే సూర్యుని ప్రకాశం.. కరోనా బ్రైట్ పాయింట్ కంటే మిలియన్ రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది టెలిస్కోప్‌ను బ్లైండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు కృత్రిమ సూర్యగ్రహణం కోసం పరిస్థితులను సిద్ధం చేసేందుకు ఈ ప్రయోగాన్ని చేపట్టారు.

ఈ మిషన్​లో భాగంగా ప్రయోగించిన రెండు ఉపగ్రహాల ద్వారా కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించనున్నారు. తద్వారా శాస్త్రవేత్తలు సూర్యుని కరోనా పొరపై లోతైన అధ్యయనం చేయనున్నారు. ఈ అద్భుత ప్రయోగంలో ఇస్రో కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం.

ప్రోబా-3 మిషన్ స్పెయిన్, పోలాండ్, బెల్జియం, ఇటలీ, స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తల కృషి ఫలితం. మిషన్‌లో రెండు ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించారు. ఈ ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి చేరుకోవడం కీలకం. ఎందుకంటే ఒకదానితో మరొకటి సమన్వయం చేసుకుంటూ కరోనాపై అధ్యయనం చేస్తాయి. ఇందులో ఏ ఒక్కటి పని చేయకపోయినా రెండో శాటిలైట్‌కు ఉపయోగం లేకుండాపోతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.