మరో 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి తుపానుగా మారే అవకాశం

మరో 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి తుపానుగా మారే అవకాశం

నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా తీవ్ర వాయుగుండం సాగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతానికి ట్రింకోమలీకి 100 కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. నాగపట్నానికి 320 కి.మీ., పుదుచ్చేరికి 410 కి.మీ., చెన్నైకి 490 కి.మీ. దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉందని చెప్పింది. 

మరో 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి తుపానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తుపానుగా మారిన తర్వాత ఉత్తర-వాయవ్య దిశగా పయనిస్తోందని వివరించింది. శనివారం ఉదయం ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వెంబడి తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది. 

కారైకాల్​-మహాబలిపురం మధ్య తీవ్రవాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో నేడు, రేపు, ఎల్లుండి(శనివారం) దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రాయలసీమలో శుక్రవారం, శనివారం అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

తీవ్ర వాయుగుండం ప్రభావంతో దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35-45 కి.మీ., గరిష్ఠంగా 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు పంపింది. గంగవరం, విశాఖపట్టణం, మచిలీపట్నం, కాకినాడ, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టులకు ఒకటో నంబరు హెచ్చరికలు జారీ చేశారు.

దీని ప్రభావంతో మూడు రోజులు (28, 29, 30) దక్షిణకోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశముందని, మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని  ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.