మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో నిందితుడిగా ఉన్న సీఐడీ విశ్రాంత అడిషనల్ ఎస్పీ ఆర్. విజయ్‌పాల్ను పోలీసులు అరెస్టు చేశారు. విజయ్‌పాల్ మంగళవారం ఉదయం ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి విచారించిన పోలీసులు, రాత్రి 7 గంటల సమయంలో అరెస్టు చేశారు.
రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ విజయపాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో సుదీర్ఘ విచారణ తర్వాత విజయ్ పాల్ ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
2021లో అప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రఘురామకృష్ణరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని రఘురామ నివాసం నుంచి ఆయన్ను బలవంతంగా గుంటూరు సీఐడీ రీజనల్ ఆఫీస్ కి తరలించారు. ఆ రోజు రాత్రి కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ రఘురామకృష్ణరాజు ఈ ఏడాది జులై 11వ తేదీన గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు నాటి సీఐడీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్, నిఘా విభాగం అధిపతి పీఎస్‌ర్ ఆంజనేయులు, సీఐడీ అడిషనల్ ఎస్పీ విజయపాల్, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ విజయపాల్ చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. దీంతో అక్టోబరు 1వ తేదీన విజయపాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టు విజయ్ పాల్ కి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. అయితే సోమవారం ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ప్రసన్న బీ వరాలేతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం సీఐడీ విశ్రాంత అడిషనల్ ఎస్పీ విజయపాల్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ క్రమంలో మంగళవారం విచారణకు హాజరైన విజయ్ పాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
More Stories
స్వస్థత పేరుతో చర్చిలో ప్రార్థనలతో ఓ బాలిక బలి
ఏపీ మంత్రివర్గంలోకి నాగబాబు
పవన్ కల్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్