జీడిమెట్ల పాలిథిన్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. రూ.100 కోట్ల నష్టం!

జీడిమెట్ల పాలిథిన్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. రూ.100 కోట్ల నష్టం!

హైదరాబాద్‌ జీడిమెట్ల పారిశ్రామికవాడలోని దూలపల్లి రహదారి పక్కనే ఉన్న ఎస్ఎస్​వీ ప్లాస్టిక్ సంచుల తయారీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమ భవనం మూడో అంతస్తులో చెలరేగిన మంటలు క్రమంగా కింది రెండంతస్తులకు వ్యాపించాయి. చూస్తుండగానే భవనం మూడో అంతస్తు అంతా అగ్ని కమ్మేసింది.  అగ్నిప్రమాదంలో రూ.100 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు.

భవనంలో పెద్ద ఎత్తున పాలిథిన్ కవర్లు, వాటి తయారీకి వాడే ముడిసరుకు నిల్వ ఉండడంతో మంటలు అంతకంతకు విస్తరించాయి. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఏడు అగ్నిమాపకశకటాలతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 40 నీళ్ల ట్యాంకర్లతో మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు.

ఒక దశలో మంటలు ఆర్పుతున్న సమయంలో భవనం పక్కనే ఉన్న విద్యుత్ హైటెన్షన్ తీగలకు నీరు తగలడంతో అధికారులకు స్వల్పంగా విద్యుదాఘాతం తగిలింది. వెంటనే అప్రమత్తమై భవనం నుంచి బయటకు వచ్చేశారు. విద్యుత్ శాఖాధికారులను పిలిపించి హైటెన్షన్‌ తీగలకు ఉన్న విద్యుత్‌ సరఫరా నిలిపివేసి తిరిగి మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యారు. 

పరిశ్రమలో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి అర్ధరాత్రి వరకు అదుపులోకి తీసుకొచ్చారు.  మంటల ధాటికి భవనం గోడలు బీటలు వారి కూలిపోయింది.   మంటల సమయంలో ఫ్యాక్టరీలోని కెమికల్‌ డ్రమ్ములు పెద్ద ఎత్తున నిల్వ ఉన్నట్లు సమాచారం. ఈ సమయంలో ఆ డమ్ములన్నీ పేలడంతో మంటలు మరింత చెలరేగాయి. ఫలితంగా మంటలను ఆర్పివేయడం అగ్నిమాపక సిబ్బందికి ఇబ్బందికరంగా మారింది.

ఒక దశలో మంటలు వంద మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడ్డాయి. దాంతో పాటు 200 మీటర్ల వరకు వేడిసెగలు వచ్చాయి. అదీకాక ఈ పాలిథిన్ ఫ్యాక్టరీలో వేస్టేజ్ చాలా ఉందని, అందువల్ల అగ్నిజ్వాలలు అదుపులోకి రావడం లేదనే వాదన స్థానికంగా వినిపిస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలు వంద మందికిపైగా కార్మికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం నేపథ్యంలో కార్మికులంతా బయటకు వెళ్లిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.