యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇటీవల పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ ప్రకటించిన రూ 100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం దుమారం రేపింది. ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కలవడానికి బయలుదేరేముందు హడావుడిగా సోమవారం ఆయన ఈ ప్రకటన చేశారు.
అదానీ గ్రూప్ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ముడుపులు చెల్లించి సౌర విద్యుత్ సరఫరా ఒప్పందాలు చేసుకున్నట్లు అమెరికా కోర్టులో ఆరోపణలు నమోదైన దృష్ట్యా ఈ విరాళాన్ని తీసుకోవడం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే రాజ్యాంగబద్ధంగానే అదానీ నుంచి పెట్టుబడులు అనుమతిస్తామని తెలిపారు. నిబంధనల మేరకే టెండర్లు పిలిచి ప్రభుత్వ ప్రాజెక్టులు ఇస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో ఎవరికైనా చట్టబద్ధంగా వ్యాపారం చేసుకొనే హక్కు ఉందని చెబుతూ అంబానీ, అదానీ, టాటా, ఇలా ఏ సంస్థకైనా తెలంగాణలో వ్యాపారం చేసుకొనే హక్కు ఉందని తెలిపారు.
“18.10.2024 నాటి మీ లేఖ ద్వారా అదానీ ఫౌండేషన్ తరపున యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి రూ. 100 కోట్లు కేటాయించినందుకు మేము మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. విశ్వవిద్యాలయం సెక్షన్ 80G కింద ఐటి మినహాయింపును పొందనందున నిధుల బదిలీ కోసం మేము ఇప్పటివరకు దాతలలో ఎవరినీ అడగలేదు. ఈ మినహాయింపు ఉత్తర్వులు ఇటీవల వచ్చినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు, తలెత్తుతున్న వివాదాలను దృష్టిలో ఉంచుకుని నిధుల బదిలీ చేయవద్దని కోరాలని ముఖ్యమంత్రి నన్ను ఆదేశించారు” అని జయేష్ రంజన్ అదానీ గ్రూప్ నకు లేఖ రాశారు.
కాగా, ఎవరికి భయపడి చెక్ వాపస్ చేశారో రేవంత్ రెడ్డి చెప్పాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఒప్పందం చేసుకున్నప్పుడు రాహుల్ గాంధీకి ఎందుకు భయపడలేదు? చెక్ వాపస్ ఇవ్వకపోతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వనని చెప్పాడా? అంటూ ఎద్దేవా చేశారు.
అదానీ తో దావోస్ లో చేసుకున్న రూ.12వేల కోట్ల ప్రాజెక్టును కూడా రద్దు చేస్తున్నారా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు.
అదానీ, మోదీ గారి మీద కాంగ్రెస్ సోకాల్డ్ నాయకులు రకరకాల మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ చట్టానికి ఎవరూ కూడా చుట్టాలుకారని బీజేపీ స్పష్టంగా చెప్తోందని డా. కాసం తెలిపారు.
దోషులెవరైనా చట్టప్రకారం శిక్ష పడుతుందని తేల్చి చెప్పారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సత్యం కేసును ఎవరైనా ఆపగలిగారా? యూపీఏ ప్రభుత్వంలో సహారా కేసులో సుబ్రతా రాయ్ కి శిక్ష పడకుండా ఎవరైనా ఆపగలిగారా? చట్టం ముందు దోషులుగా తేల్చలేదా? అని బీజేపీ నేత ప్రశ్నించారు.
స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చిన 100 కోట్లు నిధులు వెనక్కి తీసుకున్నారు సరే.. అదానీ అవినీతిపై రాహుల్ గాంధీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని నినదిస్తున్న సమయంలో దావోస్‌లో మీరు అదానీతో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందాల సంగతేంటని బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టి హరీష్ రావు ప్రశ్నించారు. అదానీకి రాష్ట్రంలోని డిస్కంలను అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు మీరు చేస్తున్న కుట్రల మాటేమిటి అని హరీశ్‌రావు నిలదీశారు.
More Stories
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు
బాంగ్లాలో హిందువులపై మారణకాండ పట్ల భారత్ చర్యలు చేపట్టాలి
భగవద్గీతలోని సర్వకాలీన విజ్ఞానం