ధర్నా చౌక్ లో  డ్రైవర్లు భారీ ఎత్తున ధర్నా

ధర్నా చౌక్ లో  డ్రైవర్లు భారీ ఎత్తున ధర్నా

తెలంగాణ ఆటో & ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ యూనియన్స్ ఐకాస ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ ,ధర్నా చౌక్ లో  డ్రైవర్లు సోమవారం భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు.   రాష్ట్ర ప్రభుత్వం ఏడాది విజయోత్చవం ఏమి సాధించిందని జరుపుకుంటోందో  అర్థం కావడంలేదని బిపిటియంయం జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి తెలిపారు. 
 
ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న రూ. 12,000 ఏమయ్యాయో, ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఎక్కడకు పోయిందో ముఖ్యమంత్రి రేవంత్  సమాధానం చెప్పాలని  డిమాండ్ చేశారు.  డ్రైవర్ల సమస్యలు పరిష్కరించడంలో, సంక్షేమం అందించటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని ఆరోపించారు. 
 
ఉద్యమాన్ని కొన్ని యూనియన్లు రాజకీయం చేసి రాజకీయ నాయకుల ప్రమేయంతో డ్రైవర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని  పేర్కొంటూ ఇది సరైనది కాదని టీఆర్ఎస్, వామపక్ష ఆటో జేఏసీ కీ హితవు పలికారు. నవంబర్ 7 వ తేది వామపక్ష, టీఆర్ఎస్ పిలుపిచ్చిన ఆటో బంద్ రాజకీయ బంద్ అని దీనికి ఆటో ఐకాస కు సంబంధం లేదని రవిశంకర్ స్పష్టం చేశారు.

కేంద్రం పెంచిన రవాణా వాహనాల ఇన్స్యూరెన్స్ 50 శాతం  తగ్గించాలని, గ్రేటర్ హైదరాబాద్ నగరంలో డీసీఎం గూడ్స్ వాహనాల అనుమతి సమయం పెంచాలని ,వన నేషన్, వన్ టాక్స్ విధానం అమలు చేయాలని, జాతీయ రహదారులపై రాష్ర్ట ప్రభుత్వ చెక్ పోస్టులు ఎత్తివేయాలని  డీసీఎం డ్రైవర్స్ యూనియన్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి వి. సమ్మయ్య యాదవ్ డిమాండ్ చేశారు.

 
ఆటో డ్రైవర్ల ఉపాధి దెబ్బతీస్తున్న  ఓల, ఊబర్, ర్యాపిడ్ బైకులను, అంబులెన్స్ డ్రైవర్ల ఉపాధి దెబ్బతీస్తున్న రెడ్ అంబులెన్స్ ను, గూడ్స్ వాహనాల డ్రైవర్ల ఉపాధి దెబ్బతీస్తున్న పోర్టర్ కంపెనీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిషేధించాలని యం.డి హాబీబ్ డిమాండ్ చేశారు.
 
రాష్ర్ట ఆటో యూనియన్ అధ్యక్షులు నంద కిషోర్, మంద రవి కుమార్, మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీస్ ల ద్వారా ఈ చలాన్లు అధికంగా  వ్రాయటం జరుగుతోంది, ఆర్టీఏ కార్యాలయాలలో దళారుల రూపంలో డ్రైవర్లను నిలువు దోపిడి చేయడం జరుగు చున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఫైనాన్సర్లు డ్రైవర్లను జలగల పట్టి పీడిస్తున్న చోద్యం చూస్తుండటంతో డ్రైవర్లు ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు.
 
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల ఉపాధి దెబ్బతీసిందని చెబుతూ రవాణా శాఖ మంత్రి గారు మొదటిలో ఆటో సంఘాలతో చర్చలు జరిపి చేతులు దుులుపు కొన్నారని విమర్శిచారు. 
 
 రాష్ట్ర  ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, ఆత్మహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలతో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, డబల్ బెడ్ రూం మంజూరు చేయాలని, ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న రూ.  12,000  వెంటనే మంజూరు చేయాలని టీఎన్ టియుసి  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోస్, బి.యం.యస్ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నంద కిషోర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 
ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి  ఇప్పటి వరకు పెదవి విప్పడం లేదని ఐకాస ప్రతినిధులు రవి టిఆర్ ఎకెటియు, ఆటో&టాక్సీ యూనియన్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి  పెంటయ్య గౌడ్ ఆరోపించారు.

ప్రైవేట్ రవాణా డ్రైవర్లను రాష్ట్ర ప్రభుత్వం చులకనగ  చూస్తోందని ఈ నేపథ్యంలో ఆటో, ప్రైవేట్ రవాణా డ్రైవర్ల సమస్యల పరిష్కారం కొరకు తెలంగాణ ఆటో& ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ యూనియన్స్ ఐకాస రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేపట్టిందని శ్రీనివాస్ జేబీఎస్, ఎన్ కిషన్ తెలిపారు. దీనిలో భాగంగా ఆటో డ్రైవర్లు భిక్షాటన చేపట్టారని డ్రైవర్లు ఉపాధి కోల్పోయి అడుక్కునే దుస్థితి తెలంగాణ లో దాపురించిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ర్ట ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి చొరవ చూపి వెంటనే చర్చలకు పిలవాలని ప్రభుత్వాన్ని కోరారు.