జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా జేఎంఎం- కాంగ్రెస్ కూటమిపై విజయం సాధించాలనే బీజేపీ ఆశలకు గండిపడింది. జేఎంఎం సారథ్యంలోని ‘ఇండియా’ కూటమికి సంపూర్ణ ఆధిక్యం కట్టబెట్టే దిశగా ఫలితాలు వెలువడుతున్నాయి. దీంతో జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ వరుసగా రెండోసారి జార్ఖాండ్ సీఎంగా పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయమైంది.
గిరిజనుల ఉనికి, చొరబాట్లు, లవ్ జీహాద్ వంటి కీలకాంశాలతో బీజేపీ మునుపెన్నడూ లేనంత విస్తృత ప్రచారం సాగించినా ‘ఇండియా’ కూటమి సమర్ధవంతంగా ఆ ప్రచారాన్ని తిప్పికొట్టినట్టు ఫలితాలు సూచిస్తున్నాయి. ఈసీ వెబ్‌సైట్ ట్రెండ్స్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటల వరకూ 81 అసెంబ్లీ స్థానాల్లో జేఎంఎం కూటమి 51 స్థానాల్లోనూ, ఎన్డీయే కూటమి 29 స్థానాల్లోనూ ఆధిక్యం కొనసాగించాయి.
బర్హయిత్ అసెంబ్లీ నియోజకవర్గంలో హేమంత్ సోరెన్ 17,347 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. ఆయన భార్య కల్పనా సోరెన్ తొలుత వెనుకబడినా విజయం వైపు దూసుకు వెళ్తున్నారు. జేఎంఎం కూటమి అభివృద్ధి కూటమికి ప్రజలు తిరిగి పట్టం కట్టారని కల్పనా సోరెన్ ఓ వైపు ఫలితాలు వెలువడుతుండగా స్పందించారు.
మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి ఐదు నెలలపాటు జైలులో ఉండిరావడంతో ఆయన భార్య కల్పనా తొలిసారిగా రాజకీయ ప్రవేశం చేసి విస్తృతంగా జనంలోకి వెళ్లి సానుభూతి పొందేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించినట్లు కనిపిస్తున్నాయి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి సుమారు 200 బహిరంగ సభలలో ప్రసంగించారు. గిరిజనులలో తమ పట్టును కాపాడుకోవడంతో పాటు పట్టణ ప్రాంతాలకు విస్తరించే ప్రయత్నాలు కొంతమేర ఫలితాలు చూపాయి.
More Stories
వక్ఫ్ జెపిసి భేటీలో ఒవైసీతో సహా 10 మంది ఎంపీల సస్పెన్షన్
భారతదేశం శక్తివంతంగా ఉండటం అంటే విధ్వంసకారిగా కాదు
మహాకుంభమేళాలో ‘సనాతన బోర్డు’ ముసాయిదా