
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాలకుగాను అధికార కూటమి సుమారు 228 స్థానాల్లో అధిక్యంలో ఉన్నది. దాంతో అధికార కూటమి విజయం దాదాపు ఖాయమైంది. కూటమిలో బీజేపీ సొంతంగా 125కు పైగా స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. ఆ తర్వాత ఏక్‌నాథ్ షిండే పార్టీ 60 స్థానాల్లో, అజిత్ పవార్ పార్టీ 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
లోక్‌సభ ఎన్నికలలో కేవలం 125 అసెంబ్లీ నియోజకవర్గాలలో మాత్రమే ఆధిక్యత ప్రదర్శించిన మహాయుతి ప్రభుత్వ వ్యతిరేకతను తిప్పికొట్టి, ఇప్పుడు అనూహ్యంగా 200కు పైగా స్థానాలు గెల్చుకోవడం రాజకీయ వర్గాలకు విస్మయం కలిగిస్తుంది. లోక్‌సభ ఎన్నికలలో 145 అసెంబ్లీ స్థానాలలో ఆధిక్యత ప్రదర్శించిన ఎంవిఎ ఇప్పుడు కేవలం 54 స్థానాలకు పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో మహాయుతికి స్పష్టమైన ఆధిక్యం వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈ కూటమి 150 నుంచి 180 వరకు సీట్లు సాధిస్తుందని వెల్లడించాయి. ఎమ్వీఏకు 90 నుంచి 110 స్థానాలు వస్తాయని అంచనా వేశాయి. ఈ అంచనాలకు మించి మహాయుతి మెజారిటీ స్థానాల్లో పాగా వేసింది.
కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తమ కూటమిలోని మూడు పార్టీల ముఖ్య నేతలకు ఫోన్ చేసి మాట్లాడారు. మహారాష్ట్ర మాజీ సీఎం, రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్‌కు, మహారాష్ట్ర ప్రస్తుత సీఎం, షిండే వర్గం శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండేకు, అజిత్ పవార్ వర్గం ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్‌కు అమిత్ షా ఫోన్ చేశారు. కలిసికట్టుగా అధికార కూటమిని గెలిపించినందుకు వారికి అభినందనలు తెలియజేశారు.
మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించిన అన్ని స్థానాల్లోనూ మహాయుతి కూటమే గెలుస్తుంది. తెలుగువారు అధికంగా స్థానాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. పుణే కంటోన్మెంట్‌లో బీజేపీ అభ్యర్థి కాంబ్లే సునీల్ ద్యాన్‌దేవ్ 35 వేలకు పైగా ఓట్ల మెజార్టీలో ఉన్నారు. బల్లార్పూర్‌లో బీజేపీ అభ్యర్థి సుధీర్ సచ్చిదానంద్ దాదాపు 25 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
హదప్సర్‌లో ఎన్‌సీపీ క్యాండిడేట్ చేతన్ విఠల్ తూపే 20 వేలకు పైగా మెజారిటీతో కొనసాగుతున్నారు. కస్బా పేత్‌లో బీజేపీ అభ్యర్థి హేమంత్ నారాయణ్ రసానే 20వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. డెగ్లూర్‌లో బీజేపీ అభ్యర్థి అంతపుర్కార్ జితేష్ రావుసాహెబ్ 25 వేలకు పైగా ఓట్ల మెజార్టీలో ఉన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి విజయం ఖరారైపోయిన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా కూటమికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మహారాష్ట్రలో చారిత్రక విజయం సొంతం చేసుకున్న మహాయుతి కూటమికి శుభాకాంక్షలు. ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజలకున్న విశ్వాసానికి ఈ విజయం ప్రతిబింబంగా నిలుస్తోంది. ప్రధాని వ్యూహాత్మక దార్శనికత, విధానాలు, ప్రజల పట్ల నిబద్ధత వికసిత్ భారత్ లక్ష్యానికి బాటలు పరుస్తున్నాయి’’ అని చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు.
ఇదిలా ఉండగా, మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిని తేల్చేందుకు బీజేపీ కేంద్ర పరిశీలకులు ముంబయికి చేరుకోనున్నారు. “రాష్ట్రం ప్రధాని మోదీకి మద్దతుగా ఉందని ఈ ఫలితాల ద్వారా వెల్లడవుతోంది. బూటకపు కథనాలు ప్రచారం చేయడం, మతం ఆదారంగా ఓటర్లను పోలరైజ్ చేయడం వంటి ప్రతిపక్షాలు చేసిన ప్రయత్నాలను ప్రజలు భగ్నం చేశారు. ఓట్లు, మా బృందం, పార్టీ నేతల కారణంగా ప్రతిపక్షాల చక్రవ్యూహాన్ని నేను ఛేదించాను” అంటూ బిజెపి నేత, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హర్షం వ్యక్తం చేశారు.
కాగా, మహాయుతి నేతల మధ్య ముఖ్యమంత్రి పదవిపై వాదోపవాదాలు జరుగుతున్నట్లు వస్తున్న మీడియా కథనాలను ఆయన కొట్టిపారవేసారు. ముఖ్యమంత్రి పదవిపై ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. మహాయుతి పార్టీల నేతలు నిర్ణయిస్తారని తెలిపారు. ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని శివసేననే, అసలైన బాలసాహెబ్ ఠాక్రే శివసేన అని మహారాష్ట్ర ప్రజలు చెప్పారని చెప్పారు. ఇది బీజేపీ విజయం అంటూ ఇందులో తన పాత్ర చాలా చిన్నదని పేర్కొన్నారు.
More Stories
తెలంగాణలోని ఎనిమీ ప్రాపర్టీస్ పై మర్చిలోగా లెక్క తేల్చాలి
భారత్ కు అమెరికా ఎఫ్-25 ఫైటర్ జెట్ లు .. చైనా, పాక్ కలవరం
రేవంత్ కట్టడి కోసమే తెలంగాణకు మీనాక్షి నటరాజన్!