తమిళనాడులో, కర్ణాటకలో, తెలంగాణలో , ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో కులం ఎంత ప్రాధాన్యం వహిస్తుందో కొట్టవచ్చినట్లు కనబడి పోతుంది. ఎలా అంటే కీలక పాత్ర ధారులలో నాల్గింట మూడు వంతులమంది పేర్లలో కులం పేరుకూడా కలిసే ఉంటుంది. మిగిలిన వారిలో కూడా మెజారిటీ అభ్యర్థులు గతంలో రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబాలలోంచి వచ్చిన వారైనపుడు పేరులో కులం లేకున్నా ఇంటి పేరును బట్టి కులాన్ని కనిపెట్టి వ్యాఖ్యానాలందించే పాత్రికేయులు పుష్కలంగా ఉన్నందున వారున్నూ ఏ కులం వారో తెలిసిపోతూ ఉంటుంది.
కొంతకాలం విదేశాల్లో ఉండి స్వదేశానికి తిరిగివచ్చి రాజకీయాల్లోకి రాదలచిన మధు అనే యువకుడు ఏఐసిసి కార్యదర్శిని కలిసి తన ఉత్సాహం ప్రకటించి నప్పుడు ఆయన (గులాం నబీ ఆజాద్) సుదీర్ఘ సంభాషణ అనంతరం నీకు లోకసభ టిక్కెట్ ఇప్పిస్తాను, కాని నువ్వు గెలవాలి అంటే, నీ పేరుకు నీకులం పేరును కూడా తగిలించు కోవాలి అనే షరతు విధించాడట. అలా మధు యాష్కీ కాస్తా మధు యాష్కీ గౌడ్ అయినాడు.
కేవలం రఘువీరారెడ్డి, పి వి చలపతిరావు వంటి ఒకరిద్దరి కులాలు చెప్పడానికి జూనియర్ పాత్రికేయులు కాస్త ఇబ్బంది పడతారేమో, మిగిలినవారి కులాలను చిటికె వేసినంత సులభంగా చెప్పేస్తారు. వారి రాజకీయాలు కూడా ఆతీరులోనే ఉంటాయని ఘంటాపదంగా చెప్తారు.
మహారాష్ట్ర విషయానికి వస్తే- ఎవరు ఏకులమో తెలుసు కోవటం అంత సులభం కాదనుకొంటాను. అయినా అనుభవజ్ఞులైన వారికి- వారికి ఉండే ఉపాయాలు వారికి ఉంటాయి. తదనుగుణంగానే వారి రాజకీయాలు ఉంటాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటినుండి మహారాష్ట్రలో కాంగ్రెసు రాజకీయాలు బ్రాహ్మణ వ్యతిరేకత, మరాఠా (ఇది భాషను సూచించే పదం కాదు, కులాన్ని సూచించే పదమే) అనుకూలత అనే మార్గంలోనే సాగిపోతున్నవి.
ఈ ధోరణికి మూలాలు ఆనాటికి రెండున్నర శతాబ్దాల ముందు నెలకొని ఉన్న పేశ్వాల పాలన కారణమని చెప్పేవారున్నారు. మహాత్మా ఫులే దిగువ కులాల వారిలో తెచ్చిన చైతన్యం కారణమని చెప్పేవారున్నారు. అంబేడ్కర్ గారి ప్రబోధాలు కారణ మనే వారూ కొందరు తటస్థ పడవచ్చు. కమ్యునిస్టులు, సోషలిస్టులు కూడా ఈ భావావేశాలను రెచ్చగొట్టిన వారేనని విశ్లేషించేవారూ కనబడుతారు.
(గాంధీగారి హత్యానంతరం ఆ హత్యలో నాథూరాంగోడ్సేకి ప్రమేయం ఉందన్న సమాచారం వచ్చీరాగానే ఈ మూడు పార్టీల మూకలు బ్రాహ్మణులపై పెద్ద ఎత్తున దాడులు చేశారు. వారి ఇళ్ళూ ,దుకాణాలు, కార్యాలయాలు తగులబెట్టారు. హతులైనవారు వందల సంఖ్యలో ఉంటారని అంచనా. ముల్గావోకర్ రచించిన Winds of Fire అనే పుస్తకంలో ఈ విషయం సవివరంగా చెప్పబడి ఉంది). ఎవరి పుణ్యమెంతో, ఎవరి పాపమెంతో లెక్కలు వేయటం అసాధ్యమని తేల్చినా, బ్రాహ్మణ వ్యతిరేకత,(వీలైనంతవరకు మరాఠా అనుకూలత) అనేది మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖమైన అంశంగా ఉంది.
1977 లోకసభ ఎన్నికల్లో దేశంలో మొదటి సారిగా కాంగ్రేసేతర ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత ఏడాది లోపల అన్ని రాష్ట్రాల్లో శాసనసభకు ఎన్నికలు జరిగాయి. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెసేతర పార్టీల/కూటమి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. (ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు ముఖ్యమంత్రి అయిన చెన్నారెడ్డిగారిపై కాంగ్రెసుకు నిధు లందించే పెనుభారం మోపబడింది. ఆ కారణాన ఆయనకు చందారెడ్డి అనే ముద్ర పడింది.)
ఆ సమయంలో శరద్ పవార్ అనే యువకుడు కాంగ్రెస్ నుండి చీలివచ్చిన బృందానికి నాయకత్వం వహించి జనతాపార్టీ, ప్రెజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీల తోడ్పాటుతో ప్రభుత్వం ఏర్పరిచారు. ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ వంటి పేరేదో పెట్టారు. ఎన్నికల అనంతరం ఏర్పడిన ఈ ఫ్రంట్ లో జనతా పార్టీ అతిపెద్ద పార్టీ. వారు తమ సంఖ్యా బలానికి గుర్తింపుగా, ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని శరద్ పవార్ ని కోరారు.
ఆయన ఇవ్వడానికి అంగీకరిస్తూ ఒక షరతు విధించాడు. అదేమిటంటే, ఉపముఖ్యమంత్రి పదవి బ్రాహ్మణులకు ఇవ్వబడదు. మరాఠా, లేదా ఆ దగ్గరగా ఉండే కులం వారైతే మంచిది. జనతాపార్టీలో పాత కాంగ్రెసు వారున్నారు, స్వతంత్ర పార్టీ వారున్నారు, సోషలిస్టు లున్నారు, జనసంఘ్ వారున్నారు. ఆ మొదటి మూడు పార్టీల్లోనూ నాయకత్వం స్థానాల్లో ఉన్న వారందరూ బ్రాహ్మణులే.
ఇతర కులాల వారందరూ పార్టీల్లో ప్రాముఖ్యం లేని స్థానాల్లోనే ఉన్నారు.
నాయకత్వస్థానాల్లో ఉన్నవారిని కాదని, అప్పటివరకు అప్రధాన స్థానాల్లో ఉన్నవారిని ఉపముఖ్యమంత్రి చేస్తే తాము శరద్ పవార్ బుట్టలో పడిపోయినట్లు తెలిసిపోతుంది. ఇలా అంతర్మథనంలో పడిన జనతా పార్టీ నేతలకు తమ మధ్య ఒక అనుభవజ్ఞు డైన వ్యక్తి- పాటిల్ ఒకరు కనిపించారు. ఆయన అప్పటికి రెండుసార్లు లోకసభ సభ్యునిగా ఉన్నవాడు. మహారాష్ట్ర అంతటా సుపరిచితుడు. ఆయనను ఎంపికచేసి ఉపముఖ్యమంత్రి పదవిని తమ పార్టీకి సంపాదించుకొన్నారు. ఆయన పూర్తిపేరు ఉత్తమరావ్ పాటిల్, జనసంఘానికి చెందిన వాడు.
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులలో ఇద్దరు ముగ్గురైనా స్వల్పకాలం ఆ పదవిని అధిష్టించిన రెడ్లు కాని వారున్నారు. వారిలో దామోదరం సంజీవయ్య, పి వి నరసింహారావు, జలగం వెంగళరావు, కొణిజేటి రోశయ్య వంటి దిగ్గజాలున్నా, వీరెవ్వరూ పూర్తికాలం పదవిలో లేరు. కాని మహారాష్ట్రలో ముస్లిములకైనా ముఖ్యమంత్రి పదవి లభించింది గాని, బ్రాహ్మణుల కెన్నడూ ముఖ్యమంత్రి పదవి రాలేదు. అబ్దుల్ రెహమాన్ అంటూలే, సుశీల్ కుమార్ షిండే గాక, మిగిలిన వారందరూ మరాఠాలే.
1990 తర్వాత శివసేన, బిజేపిలు కలిసి ప్రభుత్వం ఏర్పరిచినపుడు ముంబైకి చెందిన మనోహర్ జోషి, నారాయణ్ రాణే వంటివారు ముఖ్యమంత్రులు ఐనారు. జగన్ భుజబల్ (శివ సేన) గోపీనాథ్ ముండే (బిజేపి) ఉపముఖ్యమంత్రు లైనారు. 2014లో మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల అనంతరం బిజేపి మొదటిస్థానంలోకి వచ్చింది. నాగపూర్ కి చెందిన దేవేందర్ ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యాడు.
ఇది ముంబైపై ఆధిపత్యం చెలాయిస్తున్న రెండవతరం శివసేన నాయకునికి మ్రింగుడు పడలేదు. అప్పటివరకూ తాము నడిపించుతూ వచ్చిన బ్రాహ్మణ వ్యతిరేక రాజకీయాలను ప్రక్కన పెట్టవలసి వచ్చింది. అప్పట్లో పైకి మాట్లాడడానికి అవకాశం లభించక మిన్నకున్నా, 2019 శాసనసభ ఎన్నికల అనంతరం ఉద్ధవ్ టాకరే రచ్చచేయ నారంభించాడు.
బిజేపి, శివసేన కలిసి ప్రజలు వద్దకు వెళ్లి, జనామోదం పొందిన విషయాన్ని వదిలిపెట్టి, ఒప్పందాన్ని తిరగదోడుతూ తన కుమారుడు ఆదిత్య టాకరే ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడాలని వాదించాడు. సత్యాన్ని తిరస్కరిస్తూ ముఖ్యమంత్రి పదవి తమ పార్టీకి ఇవ్వవలసిందేనన్న ఠాక్రే వాదానికి బిజేపి తల ఒగ్గలేదు. అలా బిజేపితో పేచీ పెట్టుకొని, చివరికి శరద్ పవార్ తోను, కాంగ్రెసులోనూ కలిసి మహా వికాస అఘాడి అనే కూటమి పేరున ఉద్ధవ్ టాకరే ప్రభుత్వ మేర్పరిచాడు.
ప్రజలిచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఆ రెండు పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పడటం అంగీకరించజాలని శివసేన శాసనసభ్యులు ఒక ఏడాది తర్వాత తిరుగుబాటు చేశారు. ఏకనాథ్ షిండే నాయకత్వంలో శివసేనలో చీలిక తెచ్చారు. ఇలా నూతన నాయకత్వం ఏర్పరుచుకొన్ప శివసేన, బిజేపి కలిసి మహాయుతి పేరుతో ప్రభుత్వం ఏర్పరిచారు.
ఈ రెండింటిలో బిజేపియే పెద్ద పార్టీయే అయినప్పటికీ, దేవేందర్ ఫడ్నవీస్ దూరాన ఉన్న నాగపూర్ నుండి వచ్చినవాడు కావటము, జన్మరీత్యా బ్రాహ్మణుడనే ముద్ర ఉండటమూ ఈ రెండు కారణాలతో ఎప్పుడైనా వివాదం లేవనెత్త బడవచ్చుననే గ్రహింపుతో బిజేపి నాయకత్వం ఆతనిని ఉపముఖ్యమంత్రి స్థానానికి పరిమితం చేసింది. ఆ తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెసు పార్టీ నుండి చీలివచ్చిన అజిత్ పవార్ వీరితో కలిసి మరో ఉపముఖ్యమంత్రి అయ్యాడు.
ఈ నేపధ్యంలో మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నవి. కాంగ్రెసు పార్టీ ఏ సిద్ధాంతమూ, ఆదర్శమూ లేని పార్టీయే నని మరోసారి రుజువవుతున్నది. కులగణన, ఆచరణకు రాని ఏవేవో గ్యారంటీ లనూ వినిపిస్తూ కాంగ్రెసు ప్రచారం చేస్తున్నది. కాని అంతర్గతంగా జరుగుతున్న ప్రచారం- బిజేపి అధికారానికి వస్తే బ్రాహ్మణుడైన దేవేందర్ ఫడ్నవీస్ అవుతాడు, అది జరగకుండా అడ్డుకోవాలనే. శరద్ పవార్ చేస్తున్నదీ ఆదే. ఉద్ధవ్ టాకరే నేతృత్వం లోని శివసేన చీలికముక్క చేస్తున్న ప్రచారమూ అదే.
బిజేపి తన పార్టీ వైపునుండి గాని, తమ ఎన్డీయే వైపునుండి గాని ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. బిజేపికి ఏ కులం వారినైనా ముఖ్యమంత్రిగా తీసుకు రాగల సామర్థ్యము ఉంది. బిజేపి నాయకుల్లో అన్ని కులాల వారూ ఉన్నారు. క్రొత్తగా ఏర్పడే శాసనసభలో వివిధ పార్టీల బలాబలాలను బట్టి, విస్తృతంగా అంగీకార మయ్యే వ్యక్తిని ముందుకు తీసుకొని వచ్చి అతని చేతి మీదుగా సుపరిపాలనను అందించే ప్రయత్నంలో ఉంది.
More Stories
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు
బాంగ్లాలో హిందువులపై మారణకాండ పట్ల భారత్ చర్యలు చేపట్టాలి
భగవద్గీతలోని సర్వకాలీన విజ్ఞానం