గిరిజనుల నుండి బలవంతపు భూసేకరణ ఆపాలి

గిరిజనుల నుండి బలవంతపు భూసేకరణ ఆపాలి
 
* ఎస్‌టి కమిషన్ స భ్యుడు హుస్సేన్ నాయక్ హెచ్చరిక 

ఫార్మా కంపెనీల పేరుతో గిరిజనుల నుండి బలవంతపు భూసేకరణ ఆపాలని, అక్రమంగా అరెస్టు చేసిన వారిని పోలీసులు వెంటనే విడుదల చేయాలని, అరెస్టుల పేరుతో పోలీసులు గ్రామాలలోకి వచ్చి ప్రజలను భయబ్రాంతుల కు గురి చేయవద్దని జాతీయ ఎస్‌టి కమిషన్ స భ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ పోలీసులను హెచ్చరించారు. 

మొత్తం ఘటనపై పది రోజుల్లో విచారణ జరిపి, సిఎస్, డిజిపికి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణ పద్ధతి సక్రమంగా లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వికారాబాద్ జిల్లా, కొడంగల్ నియోజకవర్గం, లగచర్ల అధికారులపై దాడి సంఘటనలో గిరిజనులను అక్రమంగా రెస్టు చేశారనే ఫిర్యాదు నేపథ్యంలో సోమవారం లగచర్ల, వివిధ తండాలలో ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు.

ఈ సందర్భంగా తండా వాసులను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మా కంపెనీలకు తమ భూములను అప్పగించేది లేదని ప్రభుత్వానికి, అధికారులకు తేల్చిచెప్పినా ప్రాణాలు పోయినా భూములను ఇచ్చేది లేదని ఖరాఖండిగా తాము నిరాకరిస్తున్నా ప్రభుత్వం తమ భూములను ఇవ్వమనడం సమంజసం కాదని రైతులు ఆయనకు తెలిపారు.

భూములను ఇవ్వకూడదనే నిర్ణయంతోనే తాము భూసేకరణ, ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి వెళ్ళలేదని చెప్పారు. కానీ అధికారులే తమ నిర్ణయానికి వ్యతిరేకంగా గ్రామంలోకి రావడంతో అనుకోని పరిస్థితులలో దాడి జరిగిందని పేర్కొన్నారు. కానీ ఆ అర్ధ్దరాత్రి పోలీసులు తమ గ్రామాలపై పడి విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. 

మగ వారిని ఇష్టం వచ్చినట్లు కొట్టారన్న వారు మహిళలు అని చూడకుండా తమను ఇష్టం వచ్చినట్లు కొట్టారని, తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారని పోలీసుల తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జీవనాధారమైన భూములను కంపెనీలను ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. తమ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు గర్హనీయమన్నారు.

 దాడి సంఘటనలో లేని వారిని సైతం అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కమిషన్ సభ్యుడి ఎదుట వాపోయారు. అన్ని విషయాలను క్షుణ్ణంగా తెలుసుకున్న జాతీయ కమషన్ సభ్యుడు అర్ధరాత్రి విద్యుత్ బంద్ చేసి గ్రామాలలో తండాలలో పోలీసులు దాడులు నిర్వహించి అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా పరిగణించారు. 

జిల్లా ఎస్‌పి నారాయణరెడ్డిని ఈ విషయంపై ఆయన ప్రశ్నించారు. ఇకపై గ్రామాలు, తండాలలోకి పోలీసులు రావడానికి వీలులేదని ఆదేశించారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేశారు.  రైతులు భూములు ఇవ్వబోమని తేల్చి చెబుతున్నా వారి నుండి భూసేకరణ ఎలా జరుపుతారని ప్రశ్నించారు. 

భూసేకరణ సమస్య చాలా జఠిలంగా ఉన్న సందర్బంలో ఎలాంటి భద్రత లేకుండా కలెక్టర్ గ్రామంలోకి రావడాన్ని కమిషన్ సభ్యుడు తీవ్రంగా పరిగణించారు. అదే సందర్బంలో రైతులు అధికారులపై దాడి చేయడాన్ని సైతం ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. అవసరమైతే రైతులు తమ సమస్యలను అధికారులతో చర్చించాలే కానీ దాడుల సంస్కృతి ఆమోదయోగ్యం కాదని హెచ్చరించారు. 

ప్రభుత్వం సైతం ఈ గ్రామాల పరిధిలో ఏవిధమైన కంపెనీలను ఏర్పాటు చేస్తుందో రైతులకు ఇక్కడి ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని ఆయన స్పష్టం చేశారు. ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేస్తారా? లేక మరే ఇతర కంపెనీలను ఏర్పాటు చేస్తారా? అనే విషయంపై ప్రభుత్వం స్పష్టంగా తమ దృక్పథాన్ని బహిర్గతం చేయాలని ఆదేశించారు. 

అరెస్టుల పేరుతో పోలీసులు గ్రామాల్లో భయానక వాతావరణాన్ని సృష్టించారన్న కమిషన్ సభ్యుడు పోలీసులు తిరిగి గ్రామాల్లోకి వచ్చి ప్రజలను వేధిస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుందని, ఎలాంటి తప్పులు జరిగినా కమిషన్ చూస్తూ ఊరుకోదని ఆయన స్పష్టం చేశారు.