దేశ రాజధాని డిల్లీలో రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం నేపథ్యంలో సుప్రీంకోర్టు భారత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా కీలక సూచనలు చేశారు. డిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతున్నందున వీలైతే జడ్జీలు వర్చువల్‌గా వాదనలు వినిపించాలని సూచించినట్లు వెల్లడించారు.
మంగళవారం సుప్రీంకోర్టు బార్ అసోషియేషన్ అధ్యక్షుడు కపిల్ సిబల్ కాలుష్యం అంశాన్ని సీజేఐ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో తక్షణ చర్యలు అవసరమని తెలిపారు. జీఆర్‌పీఏ-4 పరిమితులను పరిగణనలోకి తీసుకొని దిల్లీలోని కోర్టులు పూర్తిగా వర్చువల్ విధానాన్ని అనుసరించాలని సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, గోపాల్ శంకరనారాయణన్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థించారు.
దీంతో ఏ కేసులైనా సరే లాయర్లు వర్చువల్ మోడ్‌లో పాల్గొని తమ వాదనలు వినిపించొచ్చని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా సూచించారు. అయితే, కోర్టులన్నీ వర్చువల్ విధానంలో నడిచేట్టుగా సూచనలు చేయాలని కొందరు సీనియర్ న్యాయవాదులు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నానుకోరగా, ఆ అభ్యర్థనలను సుప్రీం చీఫ్ జస్టిస్ తిరస్కరించారు. కోర్టులన్నీ హైబ్రిడ్ మోడల్‌లోనే పనిచేస్తాయని, అయితే వాళ్లు కావాలనుకుంటే వర్చువల్ విచారణను ఎంపిక చేసుకోవచ్చు అని సీజే సంజీవ్ ఖన్నా తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. తాజాగా ఢిల్లీ – ఎన్సీఆర్‌లో గాలి నాణ్యత సూచి 500 మార్క్‌కు చేరింది. మంగళవారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 494గా నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో ప్రజలు కళ్ల మంటలు, దురద, గొంతు నొప్పితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాజధాని ప్రాంతమంతటా గాలి నాణ్యత క్షీణించింది. నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో కాలుష్యం పెరిగింది. మంగళవారం ఉదయం పలు ఎయిర్ మానిటరింగ్ స్టేషన్లలో ఏక్యూఐ లెవల్స్ 500 మార్క్‌ను తాకాయి. ఇది సివియర్ ప్లస్ కేటగిరీని సూచిస్తుంది. ద్వారకలో అత్యల్పంగా 480గా నమోదైంది. సోమవారం కూడా ఢిల్లీలో కాలుష్యం ఇదే స్థాయిలో నమోదైన విషయం తెలిసిందే.
మంగళవారం వరుసగా రెండో రోజు కూడా దట్టమైన పొగమంచు కారణంగా భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ఏం చేశారంటూ సర్వోన్నత న్యాయస్థానం ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అమలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.
యాక్షన్ ప్లాన్ కింద కాలుష్య నియంత్రణ చర్యలను అమలు చేయడానికి కొంత తక్షణ అవసరమని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్‌కు సుప్రీంకోర్టు చెప్పింది. నాల్గో విడత ఎలాంటి ఆదేశాలు అడగకుండా తొలగించొద్దని కఠినమైన ఆదేశాలు ఇచ్చింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్-4ని తప్పనిసరిగా అమలు చేయాలని ఎన్‌సీఆర్ రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.
రాజధానిలో విషపూరిత పొగమంచు కారణంగా దృశ్యమానత పడిపోయింది. ముందు వెళ్తున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి. పొగమంచు కారణంగా విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రాజధానికి రాకపోకలు సాగించే కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా.. మరికొన్నింటిని దారి మళ్లించారు. ఇవాళ ఉదయం దాదాపు 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా.. మరో తొమ్మిది రైళ్లను అధికారులు రద్దు చేశారు.
తాజాగా ఢిల్లీ – ఎన్సీఆర్‌లో గాలి నాణ్యత సూచి 500 మార్క్‌కు చేరింది. వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు కృత్రిమ వర్షం కురిపించడం ఒక్కటే ఏకైక పరిష్కారమని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ పేర్కొన్నారు. రాజధానిలో కృత్రిమ వర్షం కురిపించేలా ప్రధాన మంత్రి నరేంద్ర మోది జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన లేఖ రాశారు.
More Stories
ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల్లోపోటీ
చైనా, ఇజ్రాయిల్, మయాన్మార్ ల్లోనే అత్యధికంగా జైళ్లలో జర్నలిస్టులు
కాలేజీల్లో కనిపించని 20 వేల మంది భారతీయ విద్యార్థులు!