
దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి సీనియర్ మంత్రి కైలాష్ గహ్లోట్ షాక్ ఇచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంత్రి పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ముఖ్యమంత్రి అతిషి ఆమోదించారు. ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు తన రాజీనామా లేఖ పంపారు.
అమలుకు నోచుకోలేని ఆప్ వాగ్దానాలు, ఇటీవల తలెత్తిన వివాదాలు వంటివి తన రాజీనామాకు కారణాలుగా అందులో ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన కీలక హామీలను పార్టీ నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు. ఎన్నికల వాగ్దానాల్లో ఒకటైన యుమునా నది ప్రక్షాళనను హామీని కూడా ఆయన ప్రస్తావించారు. యుమనా నదిని స్వచ్ఛమైన జలాలుగా మారుస్తామని వాగ్దానం చేసి ఆ పని చేయలేకపోయిందని, బహుశా గతంలో ఎన్నడూ చూడనంత కాలుష్యంలో యుమనా నది కూరుకుపోయందని విమర్శించారు.
కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు అధికార నివాసమైన ‘షీష్‌మహల్’ ఆధునీకరణ కోసం సుమారు రూ.45 కోట్లు ఖర్చు చేయడంపై వచ్చిన విమర్శలను ఆయన ప్రస్తావించారు. ఇలాంటి వాటి వల్ల ప్రజలు ఆప్‌పై నమ్మకం కోల్పోయారని తెలిపారు. శీష్ మహల్ వంటి అక్షేపణీయ, ఆందోళన కలిగించే చాలా వివాదాలు చుట్టుముట్టాయని విమర్శించారు.
దీంతో ఆప్ ఆద్మీ పార్టీని ఇప్పటికీ నమ్మవచ్చా అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలోనూ నెలకొన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ ఆశయాలు, ప్రజల పట్ల పార్టీ నిబద్ధతను ప్రశ్నించారు. ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య నిరంతర ఘర్షణలను కూడా గెహ్లాట్ తప్పుపట్టారు. దీనివల్ల రాజధాని ప్రగతి కుంటుపడిందన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాటానికి బదులు, సొంత రాజకీయ ఎజెండా కోసం ఆప్ పోరాటం సాగిస్తోందనేది కాదనలేని వాస్తవమని, ఇది చాలా బాధాకరమని అన్నారు. ఇందువల్ల ఢిల్లీ ప్రజలకు కనీస సేవలు కూడా అందించలేకున్నారని విమర్శించారు.
మరోవైపు కేంద్రంతో పోరాడటానికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తే ఢిల్లీకి నిజమైన అభివృద్ధి జరుగదని ఇప్పుడు స్పష్టమవుతున్నదని కైలాష్ గహ్లోట్ తెలిపారు. ‘ఢిల్లీ ప్రజలకు సేవ చేయాలనే నిబద్ధతతో నేను నా రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించా. దానిని కొనసాగించాలనుకుంటున్నా. అందుకే ఆప్ నుంచి వైదొలగడం తప్ప మరో మార్గం లేకపోవడంతో ఆప్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశా. మీ ఆరోగ్యం, భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అని కేజ్రీవాల్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.కాగా, ఢిల్లీ ప్రభుత్వంలో హోం, రవాణా, ఐటీ, మహిళ-శిశు అభివృద్ధితో సహా కీలకమైన శాఖలు నిర్వహిస్తున్న కైలాష్ గహ్లోట్ రాజీనామాను ఢిల్లీ సీఎం అతిషి ఆమోదించారు. ఆప్‌ను వీడిన ఆయన బీజేపీలో చేరవచ్చని తెలుస్తున్నది.
కైలాష్ గెహ్లాట్ రాజీనామాపై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు కైలాష్ గెహ్లాట్ స్పందిస్తూ ఆప్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, నిజాయితీ కోల్పోయిందని తాము ఏదైతే చెప్పామో అది కైలాష్ గెహ్లాట్ రాజీనామాతో మరింత స్పష్టమైందని విమర్శించారు. ఆప్ ఒక అబద్ధాలపుట్ట అని, అది ఇప్పుడు బయటపడిందని ధ్వజమెత్తారు.
రాజేంద్ర పాల్ గౌతమ్, రాజ్‌కుమార్ ఆనంద్, ఇప్పుడు కైలాష్ గెహ్లాట్ పార్టీ డొల్లతనాన్ని బయటపెట్టారని పేర్కొన్నారు. యమునా నదీ ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం రూ.8.500 కోట్లు విడుదల చేసిందని, ఆ సొమ్ము ఏమైందని సచ్‌దేవ్ ప్రశ్నించారు. ఢిల్లీ వనరులను దుర్వినియోగం చేయడమే ఆప్ పని అని విమర్శించారు.
More Stories
తెలంగాణలోని ఎనిమీ ప్రాపర్టీస్ పై మర్చిలోగా లెక్క తేల్చాలి
భారత్ కు అమెరికా ఎఫ్-25 ఫైటర్ జెట్ లు .. చైనా, పాక్ కలవరం
రేవంత్ కట్టడి కోసమే తెలంగాణకు మీనాక్షి నటరాజన్!