రాజ‌స్థాన్‌లో తొలి అమృత్ భార‌త్ రైలు

రాజ‌స్థాన్‌లో తొలి అమృత్ భార‌త్ రైలు
ప్రయాణికుల సౌక‌ర్యాన్ని దృష్టిలో పెట్టుకొని రైల్వేశాఖ స‌రికొత్త రైళ్లను ప్రవేశ‌పెడుతున్నది. వందే భార‌త్ త‌ర్వాత కొత్తగా అమృత్ భార‌త్ రైళ్లను ప్రవేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. తాజాగా రాజ‌స్థాన్‌లో తొలి అమృత్ భార‌త్ రైలును ప్రారంభించ‌బోతున్నది. అజ్మీర్ నుంచి జైపూర్ మీదుగా రాంచీకి న‌డ‌వ‌నున్నది. 
 
స‌మాచారం మేర‌కు ఈ అమృత్ భార‌త్ రైలు ఈ ఏడాది చివ‌రి నాటికి రాజ‌స్థాన్‌కి అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉన్నది. వందే భార‌త్ త‌ర్వాత రైల్వేశాఖ అమృత్ భార‌త్‌ని ప‌ట్టాలెక్కించేందుకు స‌న్నాహాలు మొద‌లుపెట్టింది. తొలి ద‌శ‌లో 26 రూట్లలో అమృత్ భార‌త్ రైళ్లను న‌డిపేందుకు ప్రణాళిక రూపొందించిన‌ట్లుగా రైల్వే బోర్డు అధికార‌వ‌ర్గాలు పేర్కొన్నాయి.

రాజ‌స్థాన్‌లో అమృత్ భార‌త్ రైలు న‌డ‌పనుండ‌డం ఇదే తొలిసారి. జోధ్‌పూర్ నుంచి గోర‌ఖ్‌పూర్, అజ్మీర్ నుంచి జైపూర్ మీదుగా రాంచీ మ‌ధ్య ఈ రైలును న‌డిపేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం రైల్వే రూట్‌, షెడ్యూల్‌పై అధికారులు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఆ త‌ర్వాత రైలును ప్రారంభించ‌నున్నారు. 

రైలును ప్రారంభించే తేదీ ఇప్పటికీ ఖ‌రారు కాక‌పోయిన‌ప్పటికీ అమృత్ భార‌త్ రైలును ప్ర‌ధాని న‌రేంద్రమోదీ జెండా ఊపి ప్రారంభించ‌నున్నారు. ఈ రైలు సన్నాహాలకు సంబంధించి రైల్వే బోర్డు జోనల్ రైల్వేలతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తోంది. గ‌తేడాది ప్రారంభంలో న్యూఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మిన‌ల్ రైల్వేస్టేష‌న్ నుంచి ద‌ర్భంగా జంక్షన్ వ‌ర‌కు రైలును ప్రారంభించారు. 

ఆ త‌ర్వాత ప‌లు మార్గాల్లోనూ అమృత్ భార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలును భార‌తీయ రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. రాజస్థాన్‌లోని అజ్మీర్ నుంచి రాంచీ (జైపూర్ ద్వారా) మార్గంలో న‌డిచే ఈ రైలు పూర్తిగా నాన్ ఏసీ. ఇందులో లింక్ హాఫ్‌మ‌న్ బుష్ ర్యాక్(ఎల్ హెచ్ బి) బోగీల‌ను ఉప‌యోగించ‌నున్నది. రైలులో క‌నీసం 18 నుంచి గ‌రిష్ఠంగా 22 కోచ్‌లు ఉండే అవ‌కాశం ఉన్నది. అన్ని కోచ్‌లు నాన్ ఏసీ స్లీప‌ర్‌, జ‌న‌ర‌ల్ కేట‌గిరీ చెందిన‌విగా ఉంటాయి. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు స్టెయిన్‌లెస్ స్టీల్‌తో త‌యార‌వుతాయి. వాటి జీవిత‌కాలం 30 సంవ‌త్సరాలు. 

ఇక రైల్వేశాఖ ప్రయాణికుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌లుగ‌కుండా ఉండేందుకు కోచ్‌ల‌లో అధునాత‌న‌, అత్యాధునిక సాంకేతిక హంగులు అద్దింది. ప్రయాణికుల‌కు మెరుగైన సౌక‌ర్యాలు ఉంటాయి. రైలు గ‌రిష్ఠ వేగం గంట‌కు 130 కిలోమీట‌ర్ల స్పీడ్‌తో దూసుకెళ్తుంది. త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ దూరం ప్రయాణించే సామ‌ర్థ్యం ఉన్నది. 

రైళ్లలో దొంగతనాలు జరగకుండా అమృత్ భారత్ రైలులో పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు. రైలు కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు, టాక్-బ్యాక్ వంటి అధునాతన సాంకేతికతను ఉపయోగించారు. దాంతో ప్రయాణికులు ఏదైనా ఇబ్బందిక‌ర ప‌రిస్థితిలో లోకోపైలెట్‌, రైలు మేనేజ‌ర్‌ను సంప్రదించేందుకు అవ‌కాశం ఉంటుంది. అలాగే, ప్రతి కోచ్‌లో వాక్యూమ్ బయో టాయిలెట్లు, ఇతర సౌకర్యాలు రైల్వేశాఖ క‌ల్పించింది.