మంచి విషయాలను మీడియా బలంగా ప్రచారం చేయాలని, లేకపోతే యువత ఆసక్తి కోల్పోయి బొద్దింకలను ఫాలో అవుతుందని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హెచ్చరించారు. కేరళలో ప్రముఖ మలయాళ దినపత్రిక దీపిక 140వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటూ సమాజంలో నిత్యం జరుగుతున్న సానుకూల పరిణామాలతోపాటు విజయగాథలు, సేవా కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడం మీడియా బాధ్యత అని స్పష్టం చేశారు.
యువతకు సరైన సమాచారాన్ని, ఆదర్శవంతమైన వ్యక్తుల గురించి తెలియజేయకపోతే వారు తాత్కాలిక ట్రెండ్‌లు, అనవసరమైన అంశాల వైపు ఆకర్షితం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. మంచి వార్తలను మీడియా సంస్థలు దేశ ప్రజలకు మరింత ఎక్కువగా చూపించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ చెప్పారు.
సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు, మంచి పనులు, సక్సెస్ స్టోరీలను మీడియా ఎక్కువగా చూపించకపోతే యువత తప్పుదోవ పట్టే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఒకరోజు హడావుడి చేసే అంశాలకు అతిగా ప్రచారం కల్పించడం సరైంది కాదని చెబుతూ నిజంగా విలువైన విషయం అయితే వారం, 10 రోజులు లేదా నెల తర్వాత కూడా ప్రజలు గుర్తుంచుకుంటారని ఆయన కాక్రోచ్ జనతా పార్టీని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
‘బొద్దింక జనతా పార్టీ’ (సిపిజే) చుట్టూ నెలకొన్న సోషల్ మీడియా హడావిడిని ప్రత్యక్షంగా ప్రస్తావించకుండానే, అటువంటి పోకడలకు ఇంత తక్కువ వ్యవధిలో అంతటి ప్రాచుర్యం లభించడంపై రాధాకృష్ణన్ ప్రశ్నించారు. “ఏదైనా నిజంగా గొప్పదైతే, ఒక వారం, పది రోజులు లేదా ఒక నెల గడిచినా సరే, ప్రజలు దాని విలువను గుర్తించడం కొనసాగిస్తారు,” అని ఆయన పేర్కొన్నారు.
అదే సమయంలో సమాజాన్ని నిర్మించడంలో నిర్మాణాత్మక జర్నలిజం కీలక పాత్ర పోషిస్తుందని సీపీ రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. “సానుకూల కార్యకలాపాలను సక్రమంగా వెలుగులోకి తీసుకురావాలి. అప్పుడే యువతకు సరైన సమాచారం అందుతుంది. లేదంటే, వారు ఆసక్తి కోల్పోయి, చివరికి ఆ ‘బొద్దింక’ను అనుసరించే పరిస్థితి ఏర్పడుతుంది,” అని ఆయన తెలిపారు.
కరుణ, శాస్త్రీయ పురోగతి, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవ, మానవ విజయాలను మీడియా ప్రముఖంగా ప్రోత్సహిస్తే సమాజంలో సానుకూల మార్పులు వస్తాయని ఆయన సూచించారు. ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడం, జాతీయాభివృద్ధికి ప్రేరణ కల్పించడం మీడియా ప్రధాన బాధ్యత అని ఉప రాష్ట్రపతి గుర్తు చేశారు. ఉపరాష్ట్రపతి, ‘దీపిక’ 140 ఏళ్ల ప్రస్థానాన్ని “నిబద్ధత, ధైర్యం, విశ్వసనీయత, ప్రజాసేవలతో కూడిన ఒక విశిష్ట వారసత్వం”గా అభివర్ణించారు. ఈ సందర్భంలో కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ కూడా పాల్గొన్నారు.

More Stories
బహుపాక్షిక వ్యూహం ద్వారా అంతర్జాతీయ వివాదాల పరిష్కారం
భద్రతా మండలి సంస్కరణలను ఇకపై ఆలస్యం చేయలేం
మోల్డోవా నుండి గ్యాంగ్స్టర్ అమృత్పాల్ సింగ్ భారత్ కు అప్పగింత