మమతా బెనర్జీ సమావేశానికి 60 మంది ఎమ్మెల్యేల డుమ్మా

మమతా బెనర్జీ సమావేశానికి 60 మంది ఎమ్మెల్యేల డుమ్మా
మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ నేతలు వరుసగా దూరమవుతున్నారు.  ఆమె నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో ఆదివారం నిర్వహించిన సమావేశానికి ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. 20 మంది వరకు ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. దీంతో ఏకంగా ఈ సమావేశాన్ని రద్దు చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. 
 
ఈ సమావేశం గురించి పార్టీ ఎమ్మెల్యేలకు ముందుగానే సమావేశం అందింది. టీఎంసీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ షోవన్‌దేవ్ ఛట్టోపాధ్యాయ్ అందరికీ సమావేశం గురించి చెప్పారు. కోల్‌కతాలోని, కాలిఘాట్‌లో ఉన్న పార్టీ అధినేత్రి మమత నివాసంలో, ఆమె ఆధ్వర్యంలోనే ఆదివారం సమావేశం ఉంటుందని ఆయన అందరికీ చెప్పారు. 80 మంది ఎమ్మెల్యేలకు సమాచారం అందిస్తే, 20 మంది మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. 
 
ఈ రోజు హాజరైన వారితో మమత కొద్దిసేపు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంపై టీఎంసీ స్పందిస్తూ అభిషేక్ బెనర్జీపై శనివారం, కల్యాణ్ బెనర్జీపై ఆదివారం దాడి జరిగిన నేపథ్యంలో, తమ నేతలపై వరుసగా జరుగుతున్న దాడులకు భయపడి ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి రాలేదని పార్టీ అగ్రనాయకత్వం తెలిపింది. దీనంతటికీ కారణం బీజేపీనే అని విమర్శించింది.
 
“ఈ సమావేశం ముందుగానే నిర్ణయించబడింది. అయితే, మా నాయకులపై జరిగిన దాడుల పర్యవసానంగా, మా ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు; దీనికి ప్రతిగా మా కార్యకర్తలపై పోలీసులు తీవ్ర చర్యలు తీసుకుంటున్నారు,” అని టిఎంసి అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ విలేకరులతో పేర్కొన్నారు. “క్షేత్రస్థాయి పరిస్థితులను చక్కదిద్దడంలోనూ, అరెస్టు అయిన మా కార్యకర్తలకు సహాయం చేయడంలోనూ నిమగ్నమై, సమావేశానికి హాజరు కాలేకపోయిన ఎమ్మెల్యేలు ఈ పరిణామాల గురించి శాసనసభాపక్షానికి తెలియజేసి, సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేయగలరా అని కోరారు,” అని ఘోష్ జోడించారు.

అయితే, నిజంగానే ఎమ్మెల్యేలు దాడులకు భయపడి రాలేదా? లేదా పార్టీ అధినాయకత్వంపై ఆగ్రహంతో ఉన్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీఎంసీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. కొందరు తమ పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నారు. దీంతో టీఎంసీలో ఎంతమంది నేతలు కొనసాగుతారనేది అనుమానాస్పదమే.

మరోవైపు బీజేపీ చేస్తున్న దాడులకు నిరసనగా జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ నేతలు ఆందోళన నిర్వహించనున్నారు. మమతా బెనర్జీ కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారు.