ప్రజాపాలన పేరుతో గ్రామాలలో పోలీస్ నిర్బంధం

ప్రజాపాలన పేరుతో గ్రామాలలో పోలీస్ నిర్బంధం

ప్రజాపాలన చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ నేడు గ్రామాల్లో పోలీసు నిర్బంధంతో భయానక వాతావరణం సృష్టిస్తున్నదని బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని   నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజల నోట్లో మట్టికొడుతున్నరని మండిపడ్డారు. కొడంగల్ లో జరిగింది అధికారులపై దాడి కాదని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు కట్టలు తెంచుకున్న ఆగ్రహమే.అని ఆయన స్పష్టం చేశారు. 

కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన ఘటనపై పూర్తిస్థాయి న్యాయవిచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో ఫార్మా కంపెనీల కోసం రైతుల నుంచి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నరని చెబుతూ ఫార్మా కంపెనీ కోసం రైతుల భూములు గుంజుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడంతో ఆ ప్రయత్నాలకు వ్యతిరేకంగా ప్రజలు కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఉన్నారని ఆయన తెలిపారు.

అందుకనే ప్రజల ఆగ్రహానికి అధికారులు బలయ్యారని ఆయన చెప్పారు. తనపై దాడి జరగలేదని జిల్లా కలెక్టర్ బహిరంగంగా ప్రకటించినప్పటికీ గ్రామాల్లో నిర్బంధం పెట్టి అక్రమంగా 50 మందిపై కేసులు నమోదు చేయడం పట్ల డా. వెంకటేశ్వర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ సేవలు బంద్ పెట్టి మరీ పోలీసుల దిగ్భందం చేసి ప్రజలను వేటాడుతుండటం దౌర్జన్యం జరపడమే అని ఆయన మండిపడ్డారు. ఈ ఘటన చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ప్రజలు మరింత తీవ్రంగా అసహ్యించుకుంటున్నరని చెప్పారు.

చౌటుప్పల్ దగ్గర దివిస్ కంపెనీ నుంచి మొదలు రాష్ట్రంలో చాలా కంపెనీల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వలేదని డా. కాశం విమర్శించారు. ఆయా కంపెనీలతో భూగర్భజలాలు, గాలి కలుషితమై రైతులు పంటలు పండించుకోలేని పరిస్థితి దాపురించిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి 10 ఫార్మా క్లస్టర్లు చేస్తమని చెబుతూ దోచుకునే ప్రయత్నం చేస్తున్నడని ఆయన ఆరోపించారు. 

రేవంత్ రెడ్డి, ఆయన బామ్మర్ది సృజన్ రెడ్డితో పార్ట్నర్ షిప్ చేస్తూ ఫార్మా కంపెనీ పెట్టేందుకు ప్రయత్నిస్తూ ప్రజల మీద దాడులు చేస్తున్నారని బిజెపి నేత ధ్వజమెత్తారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా ఖండించారు.  మొన్న కొమురవెల్లి మండలం గురువన్నపేట గ్రామంలో ఓ దుర్మార్గుడు మతం మాటున మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో పోలీసులు ఆ గ్రామాన్ని నిర్బంధం చేశారని ఆయన గుర్తు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం నేడు కొడంగల్ నియోజకవర్గంలో 6 గ్రామాల్లో నిర్బంధం పెట్టి రాకపోకలను బంద్ చేసిందని డా. వెంకటేశ్వర్లు తెలిపారు. రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు అదే తరహాలో ఉరికించక తప్పదని ఆయన హెచ్చరించారు. కేంద్ర మంత్రితో భేటీ కోసమని కేటీఆర్ ఢిల్లీకి వెళ్లిన టూర్ వెనుక మతలబు మరోటి ఉందని, మరో డ్రామా ఉందని ఆయన ఆరోపించారు. జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డబ్బులు పంపేందుకే కేటీఆర్ ఢిల్లీకి వెళ్లిండని ఆయన స్పష్టం చేశారు. 

ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లిండని చెబుతూ రేవంత్ రెడ్డి- కేటీఆర్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నరని విమర్శించారు. కొడంగల్ లో ప్రజలను అక్రమంగా అరెస్టు చేసి, కేసులు బనాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బిజెపి నేత స్పష్టం చేశారు. ఫార్మా కంపెనీకి ప్రజల నుంచి భూములు తీసుకోవాలనుకుంటే వారిని ఒప్పించాలని, అంతేకాని ఒత్తిడితో లాక్కోవాలని చూస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.