రాష్ట్రంలో అనేకచోట్ల వడ్ల కొనుగోలు కేంద్రాల్లో టోకెన్లు ఇవ్వకుండా, కాంటా పెట్టకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నరని బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వరి ధాన్యం ప్రతి గింజ కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి ఆధ్వర్యంలో బిజెపి నాయకుల బృందం రైతు కల్లాలను సందర్శించిన్నట్లు ఆయన తెలిపారు.
యాదాద్రి జిల్లా పోచంపల్లి మండల కేంద్రంతోపాటు రేవన్నపల్లిలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్, జడ్చర్లలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కరీంనగర్ జిల్లా, మానకొండూర్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, రైతుల సమస్యలను తెలుసుకున్నారని చెప్పారు.
ఎక్కడికెళ్లినా రైతులకు రుణమాఫీ చేయలేదని, రైతు భరోసా ఇవ్వలేదని, ధాన్యం కొనుగోళ్లు జరపడం లేదని రైతులు సమస్యలు చెప్పుకుంటున్నరని ఆయన తెలిపారు. రైతు పండించిన పంటలకు రూ. 500 చొప్పున బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ప్రకటించారని, కానీ అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలోకి తొక్కి సన్నవడ్లకే బోనస్ ఇస్తమని చెబుతున్నరని ఆయన ధ్వజమెత్తారు.
కేంద్ర ప్రభుత్వం ధాన్యంపై ఇచ్చే రూ. 2,320 ఎంఎస్ పీతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 బోనస్ ఇచ్చి రూ. 2,820 ఇచ్చి ధాన్యం కొనుగోలు చేస్తమన్న కాంగ్రెస్ నాయకుల మాటలు ఏమయ్యాయి? అని రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. ఆనాడు మాజీ సీఎం కేసీఆర్ సన్నాలు పండించొద్దన్నారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తమంటున్నదని తెలిపారు.
ధాన్యం కొనుగోళ్లను పరిశీలిస్తే 40 కిలోల ధాన్యానికి కిలోన్నర ధాన్యం తరుగు తీస్తున్నరని, రైస్ మిల్లులకు వెళ్లేసరికి సుమారు 100 కిలోలకు 3 కిలోల చొప్పున తాలు, తరుగు పేరుతో కోత పెడుతున్నరని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లర్లు, దళారులతో కుమ్మక్కైందని బీజేపీ నేత ఆరోపించారు. దళారుల ప్రమేయంతో రైతులు సుమారు క్వింటాలు బియ్యానికి రూ. 700-800 మేర నష్టపోతున్నడని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కొనుగోళ్లు ఆలస్యం చేస్తుండటంతో రైతులు ఇప్పటికే రాష్ట్రంలో 40 శాతం మేర వడ్ల ధాన్యాన్ని దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు. ధాన్యం కొనుగోలు కోసం ప్రతి పైసా వడ్డీతో సహా కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్నదని, అయితే రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లర్లతో కుమ్మక్కై 15 రోజులు గడిచినా మార్కెట్ యార్డుల్లో రైతుల ధాన్యం కొనుగోలు చేయకుండా ఆలస్యం చేస్తూ చెలగాటమాడుతున్నదని ఆయన విమర్శించారు.
More Stories
బాంగ్లాలో హిందువులపై మారణకాండ పట్ల భారత్ చర్యలు చేపట్టాలి
తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిన గుడ్ల ధర
పోలీసులు క్షమాపణలు చెప్పాల్సిందే.. ఆశా వర్కర్లు